sudhapalem issue
-
బాధితులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య అమలాపురం టౌన్: సూదాపాలెం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.పది లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్నీ రమణయ్య , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.రాము డిమాండు చేశారు. దాడిలో గాయ పడి అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వార మాట్లాడుతూ బాధిత కుటుంబాల్లో ఒక్కక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. సూదాపాలెం ఘటన విచారణకు అమలాపురంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చి కూడా బాధితులను పరామర్శించేందుకు రాకపోవటం ఆయన అహంకారానికి నిదర్శమని గుర్తు చేశారు. దండోరా నాయకుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ వారికి సూదాపాలెం ఘటన గురించి వివరించారు. జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బుంగ సంజయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లవరపు వెంకట్రావు, మడికి శ్రీరాములు, పిప్పర సంపదరావు తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాలపై ఉన్న ప్రేమ..మనుషులపై లేదా?
సూదాపాలెం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేయాలి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ అమలాపురం : ‘మూగజీవాలపై ఉన్న ప్రేమ.. మనుషులపై లేకుండా పోయిందా? గో సంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సమంజసమేనా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. సూదాపాలెం ఘటనలో కొన్ని సంస్థల పేర్లు వినిపిస్తున్నందున ప్రత్యేక దర్యాప్తు చేయాలి’ అని వివిధ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. స్థానికి జానికీపేటలో శనివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కుల వ్యతిరేక పోరాట సంఘం, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐల ప్రతినిధులు పాల్గొన్నారు. సీపీఎం డివిజన్ కార్యాదర్శి మోర్తా రాజశేఖర్, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గో సంరక్షణ పేరుతో ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, వీహెచ్పీల ఆగడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బంధీగా అమలు చేయాలని, చట్టపరంగా బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బొమ్మి ఇజ్రాయిల్, పి.వసంతకుమార్, టి.నాగవరలక్ష్మి, చిట్టిబాబు, ఎ.శ్రీనివాస్, మడికి శ్రీరాములు పాల్గొన్నారు. త్వరలో ఛలో అమలాపురం సూదాపాలెం ఘటనకు నిరసనగా త్వరలో ఛలో అమలాపురం నిర్వహిస్తామని దళిత ఐక్యవేదిక ప్రకటించింది. స్థానిక ప్రీతి లాడ్జిలో శనివారం ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఐక్యవేదిక చైర్మన్ డీబీలోక్ మాట్లాడుతూ ఛలో అమలాపురం తేదీని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. దళితులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి కాకుండా దాడులకు పాల్పడినవారి వద్ద నుంచి పరిహారం వసూలు చేయాలన్నారు. అలా చేస్తేకాని భవిష్యత్తులో ఇలాంటి దాడులను అరికట్టలేమన్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. చనిపోయిన పశువుల మృతదేహాలను కులవృత్తులు వారు కాకుండా పశువుల యజమానులే స్వయంగా ఖననం చేసుకోవాలని, మతతత్వ శక్తులైన ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, గో సంరక్షణ సమితులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కో ఆర్డినేటర్ ఉండ్రు బాబ్జి, కన్వీనర్ జంగా బాబూరావు, పి.చిట్టిబాబు, నక్కా సంపత్ కుమార్, పశ్చిమాల వసంతకుమార్, కారం వెంకటేశ్వరరావు, కుంచే స్వర్ణలత, సాధనాల వెంకట్రావు, ఎం.ఎ.కె.భీమారావు, మట్టా వెంకట్రావులు పాల్గొన్నారు. -
చెట్లకు కట్టారు.. రాళ్లతో కొట్టారు..
ఆవులను చంపుతున్నారన్నది అపోహ కాదు పథకం ప్రకారమే దాడి చేశారు ఏం జరిగిందో చెప్పే అవకాశం ఇవ్వలేదు పోలీసుల ఎదుటే చితకబాదారు జగన్ ఎదుట సూదాపాలెం బాధిత దళితుల ఆవేదన ఆస్పత్రిలో బాధితులకు వైఎస్సార్సీపీ అధినేత పరామర్శ అండగా ఉంటానని భరోసా అమలాపురం టౌన్ : ‘అర్ధరాత్రి.. కటిక చీకట్లో చెట్లకు కట్టి రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. తర్వాత మోకాళ్లపై నిలబెట్టి చెప్పులతో కొట్టారు. అసలు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా రాళ్లు, కర్రలతో చితకబాదారు’ అని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం ఘటనలో తీవ్రంగా గాయపడిన దళిత బాధితులు వైఎస్సార్సీపీ అధినేత, శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చర్మకారులైన మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు, సవరపు లక్ష్మణకుమార్, మోకాటి ప్రేమ్‌లను జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటిగంటకు కారులో అమలాపురం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఒక్కో బాధితుని మంచంవద్ద జగన్మోహన్రెడ్డి పావుగంట సేపు ఉండి, వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. బాధితులు, వారి కుటుంబీకులతో మమేకమై అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాయపడ్డవారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని వారితో మాట్లాడారు. అంతా పథకం ప్రకారమే.. దాడిలో గాయపడ్డ ఎలీషాను తొలుత జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. దాడి ఎలా జరిగిందని ఆరా తీశారు. ఆవులను అపహరించి వధిస్తున్నారని అపోహ పడే దాడి చేశారని చెప్పటం వాస్తవం కాదని, పక్కా పథకం ప్రకారమే దాడి చేశారని.. గొడవ పెద్దదవడంతో అపోహ పడ్డామన్న కట్టుకథ అల్లారని ఎలీషా, అతని భార్య లీలావతి, కుమారులు చంటిబాబు, చిట్టిబాబులు వివరించారు. చనిపోయిన ఆవును మాత్రమే తాము తీసుకువచ్చి చర్మం తీస్తున్నామని ఎంత చెబుతున్నా వినకుండా దాడి చేశారని చెప్పారు. అపోహ అనే మాటను పదేపదే చెప్పి, దాడిని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రికి కాకుండా స్టేషన్‌కు తీసుకువెళ్లారు ‘చెట్లకు కట్టేసి రాళ్లతో కొట్టిన తరువాత సమాచారం అందుకుని సూదాపాలెం శ్మశానానికి పోలీసులు వచ్చారు. ఆలోగా విషయం తెలిసి మా బంధువులమంతా అక్కడికి వెళ్లాం. పోలీసులు వచ్చిన తర్వాత కూడా మావాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టి మళ్లీ చితకబాదారు’ అని గాయపడ్డ రెండో బాధితుడు మోకాటి వెంకటేశ్వరరావు, భార్య సత్యనారాయణమ్మ, కుమారులు జగన్మోహన్రెడ్డితో చెప్పారు. తలలు, కాళ్లకు తీవ్రగాయాలై ఉన్న తమను ముందు ఆస్పత్రికి కాకుండా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ గంటన్నరసేపు ఉంచారని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతసేపూ తాము రక్తం కారుతున్న దెబ్బలతోనే ఉన్నామన్నారు. తమ కుల పెద్దలు స్టేషన్‌కు వచ్చి జామీను ఇస్తేనే ఆస్పత్రికి తరలించారని చెప్పారు. వ్యాన్‌లో గొడ్లను పడేసినట్లు పడేశారు వ్యాన్‌లో గొడ్లను తరలించినట్టుగా పడేసి గాయపడ్డ తమను స్టేషన్‌కు తీసుకు వచ్చారని వెంకటేశ్వరరావు కుమారుడు రాజు.. జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిలో స్వల్పంగా గాయపడ్డ సవరపు లక్ష్మణకుమార్, పదో తరగతి చదువుతున్న మోకాటి ప్రేమ్‌ను కూడా జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బాలుడని కూడా చూడకుండా తనపై ఆటవికంగా దాడి చేశారని ఆ బాలుడు చెబుతూంటే జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ‘ఇంత దారుణమా..? ఇంత దౌర్జన్యమా..? అని ఆయన కూడా ఆవేదన చెందారు. అమలాపురంలో అరవింద్ అనే రైతుకు చెందిన ఆవు చనిపోతే ఆయన అనుమతితోనే తెచ్చి దాని చర్మాన్ని ఒలుస్తున్నామని చెబుతున్నా.. ఆ రైతు అరవింద్‌కు ఫోన్ చేసి ఆయనతోనే మాట్లాడాలని ఫోన్ ఇస్తున్నా దాడి చేసినవారు పట్టించుకోకుండా రాళ్లు, చెప్పులతో కొట్టారని బాధితులు జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. బాధితులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. బాధితులకు రావాల్సిన రూ.8.25 లక్షలు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. -
దళితులపై దాడి అమానుషం
ఎమ్మెల్సీ బోస్ అమలాపురం : ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో దళితులపై దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. దాడులు ఆగని కారణంగా గతంలో పార్లమెంట్లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్టు ఫర్ ఎస్సీ, ఎస్టీ చట్టం ఆమోదించారని, అయినా దాడులు ఆగకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించినా అంబేడ్కర్ ఆశించిన ఒక కొత్త సామాజిక వ్యవస్థ చరిత్ర గర్భం నుంచి ఇంకా బయటపడలేదు’ అని ఓ సామాజిక విశ్లేషకుడు అన్న మాటలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నిజమనిపిస్తున్నాయన్నారు. ఆర్థిక అసమానతల కారణంగానే ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిని రూపుమాపడానికి, దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించడం ద్వారా దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించడం లేదని బోస్ విమర్శించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా...
సూదాపాలెం బాధితులను పరామర్శించిన జగన్ గంటకుపైగా బాధితుల మధ్య జిల్లాకు వచ్చిన బాబు ఇటువైపు రాలేదెందుకు? అడుగడుగునా ఘనస్వాగతం.. అమలాపురం : ‘అధైర్యపడొద్దు.. నేను మీకు అండగా ఉన్నా.. మీకు న్యాయం జరిగే వరకు వెన్నెంటే ఉంటాను. మీకు ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన పరిహారం అందే వరకూ పోరాటం చేస్తాను’ అని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం బాధితులకు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం బాధిత దళితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో మధురుపూడికి చేరుకున్నారు. చాలా రోజుల తరువాత జగన్ జిల్లా పర్యటనకు రావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మధురపూడి చేరుకున్నారు. బయటకు వచ్చిన జగన్ నేరుగా కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అభిమానులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కారు ఎక్కి అభివాదం చేయడంతో కేరింతలు, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో విమానాశ్రయం మారుమోగిపోయింది. ఎయిర్‌పోర్టు దాటిన తరువాత రాజమహేంద్రవరం– కోరుకొండ రోడ్డులో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితోపాటు స్థానికులు స్వాగతం పలికారు. పార్టీ రంగులతో ఉన్న గొడుగును అందించిన విజయలక్ష్మి స్థానిక నాయకులను పరిచయం చేశారు. అక్కడ నుంచి బయలుదేరి మోరంపూడి జంక్షన్, వేమగిరి, కడియపులంక, జొన్నాడ సెంటర్లలో జనం స్వాగతం పలికారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటరులో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట కౌశికరోడ్డు వద్ద మహిళలు, కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున వచ్చి ఆప్యాయంగా అభివాదం చేశారు. అక్కడ నుంచి అమలాపురం బయలుదేరిన జగన్‌కు అంబాజీపేట మండలం ముక్కామల సెంటరులో భారీ స్వాగతం లభించింది. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. కార్యకర్తల కోరిక మేరకు అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా అమలాపురం ఏరియా ఆస్పత్రికి మ«ధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. గంటపాటు బాధితులతోనే... సూదాపాలెం ఘటనలో గాయపడిన బాధిత దళితులతో జగన్ గంటపాటు గడిపారు. చికిత్స పొందుతున్న మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు, సవరపు లక్ష్మణకుమార్, సవరపు ప్రేమ్‌ను జగన్ కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారి చేతలను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా మాట్లాడారు. పదో తరగతి చదువుతున్న ప్రేమ్ తనపై జరిగిన దాడిని వివరించగా జగన్ చలించిపోయారు. జగన్ వస్తున్నారని తెలిసి కోనసీమ నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. కనీసం మనోధైర్యం కల్పించలేరా? అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్ బాధితులపై విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరించిన తీరును తూర్పారబట్టారు. గురువారం రాజమహేంద్రవరం వచ్చిన చంద్రబాబు 60 కి.మీ.ల దూరంలో ఉన్న బాధితులను పరామర్శించడానికి రాలేరా? వారికి కనీసం మనోధైర్యం కల్పించలేరా? కేవలం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని నిప్పులు చెలరేగారు. ప్రివెన్షనల్ అట్రాసిటీ యాక్టు కింద బాధిత దళితులకు ఇవ్వాల్సిన గరిష్ఠ పరిహారం రూ.8.25 లక్షల ఒక్కొక్క బాధితునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతరుల బాధలను తెలుసుకుంటా... ఆస్పత్రి నుంచి జగన్ నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏయిర్పోర్టు వద్ద రాజమహేంద్రవరానికి చెందిన పేపరు మిల్లు కార్మికులు జగన్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. 35 మంది కార్మికులను యాజమాన్యం విధుల నుంచి తొలగించిందని కార్మికులు వాపోయారు. పక్కనే ఉన్న కన్నబాబుతో జగన్ మాట్లాడుతూ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయాలన్నారు. సూరంపాలెం ఎత్తిపోతల ప«థకం రైతులు కూడా జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం మండల కన్వీనర్ తోరాటి శ్రీను ఆధ్వర్యంలో రైతులు జగన్‌తో మాట్లాడుతూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హాయాంలో ఈ ఎత్తిపోతల çపథకం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప«థకం ద్వారా సాగునీరందడం లేదని, ప్రస్తుత నేతలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని, ఎత్తిపోతల పథకం తీరుతెన్నులను పరిశీలించాలని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని జగన్ సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతాల రాజేశ్వరి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. జిల్లాలో గడపగడపకు వైఎస్సార్ జరుగుతున్న తీరును విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
దళితులపై దాడులకు దిగితే కఠిన చర్యలు
మంత్రి కిషోర్‌బాబు అమలాపురం : దళితులపై దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం దళిత సోదరులను రాజప్ప గురువారం ఉదయం పరామర్శించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను ఆర్డీవో జి.గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య మంత్రి రాజప్పకు వివరించారు. ఈ దాడి గురించి రాజప్పకు వివరించిన దండోరా నాయకులు దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజప్పతోపాటు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, కోనసీమ దండోరా అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ తదితరులు బాధితులను పరామర్శించారు. దాడి బాధితులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : మంత్రి కిషోర్‌బాబు సూదాపాలం దాడి బాధిత దళిత సోదరులిద్దరికీ లేదా వారి కుటుంబాల్లో ఎవరో ఒకరికి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు హామీ ఇచ్చారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాడి బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత సోదరులపై దాడి చేసినప్పుడు యెరుబండి అబ్బులు తన పేరు చెప్పి మరీ దాడి చేయటాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని డీఎప్పీ అంకయ్యకు మంత్రి సూచించారు. దాడి సంఘటన వివరాలను మంత్రికి ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ తెలియజేశారు. పోలీసులకు మంత్రి అభినందన దాడి సమయంలో సమయస్ఫూర్తితో సకాలంలో పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవటం వల్లే అనర్థాలు జరగలేదని మంత్రి రావెల అన్నారు. అమలాపురం పోలీసులను ఈ విషయంలో అభినందిస్తున్నానని చెప్పారు. దళిత నాయకులు మోకాటి నాగేశ్వరరావు, బొమ్మి ఇజ్రాయిల్ కూడా మంత్రికి ఘటన గురించి వివరించారు.