దళితులపై దాడి అమానుషం
Published Fri, Aug 12 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
ఎమ్మెల్సీ బోస్
అమలాపురం :
ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో దళితులపై దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. దాడులు ఆగని కారణంగా గతంలో పార్లమెంట్‌లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్టు ఫర్ ఎస్సీ, ఎస్టీ చట్టం ఆమోదించారని, అయినా దాడులు ఆగకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించినా అంబేడ్కర్ ఆశించిన ఒక కొత్త సామాజిక వ్యవస్థ చరిత్ర గర్భం నుంచి ఇంకా బయటపడలేదు’ అని ఓ సామాజిక విశ్లేషకుడు అన్న మాటలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నిజమనిపిస్తున్నాయన్నారు. ఆర్థిక అసమానతల కారణంగానే ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిని రూపుమాపడానికి, దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించడం ద్వారా దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించడం లేదని బోస్ విమర్శించారు.
Advertisement
Advertisement