అధైర్యపడొద్దు.. అండగా ఉంటా...
-
సూదాపాలెం బాధితులను పరామర్శించిన జగన్
-
గంటకుపైగా బాధితుల మధ్య
-
జిల్లాకు వచ్చిన బాబు ఇటువైపు రాలేదెందుకు?
-
అడుగడుగునా ఘనస్వాగతం..
అమలాపురం :
‘అధైర్యపడొద్దు.. నేను మీకు అండగా ఉన్నా.. మీకు న్యాయం జరిగే వరకు వెన్నెంటే ఉంటాను. మీకు ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన పరిహారం అందే వరకూ పోరాటం చేస్తాను’ అని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం బాధితులకు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం బాధిత దళితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో మధురుపూడికి చేరుకున్నారు. చాలా రోజుల తరువాత జగన్ జిల్లా పర్యటనకు రావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మధురపూడి చేరుకున్నారు. బయటకు వచ్చిన జగన్ నేరుగా కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అభిమానులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కారు ఎక్కి అభివాదం చేయడంతో కేరింతలు, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో విమానాశ్రయం మారుమోగిపోయింది. ఎయిర్‌పోర్టు దాటిన తరువాత రాజమహేంద్రవరం– కోరుకొండ రోడ్డులో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితోపాటు స్థానికులు స్వాగతం పలికారు. పార్టీ రంగులతో ఉన్న గొడుగును అందించిన విజయలక్ష్మి స్థానిక నాయకులను పరిచయం చేశారు. అక్కడ నుంచి బయలుదేరి మోరంపూడి జంక్షన్, వేమగిరి, కడియపులంక, జొన్నాడ సెంటర్లలో జనం స్వాగతం పలికారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటరులో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట కౌశికరోడ్డు వద్ద మహిళలు, కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున వచ్చి ఆప్యాయంగా అభివాదం చేశారు. అక్కడ నుంచి అమలాపురం బయలుదేరిన జగన్‌కు అంబాజీపేట మండలం ముక్కామల సెంటరులో భారీ స్వాగతం లభించింది. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. కార్యకర్తల కోరిక మేరకు అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా అమలాపురం ఏరియా ఆస్పత్రికి మ«ధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు.
గంటపాటు బాధితులతోనే...
సూదాపాలెం ఘటనలో గాయపడిన బాధిత దళితులతో జగన్ గంటపాటు గడిపారు. చికిత్స పొందుతున్న మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు, సవరపు లక్ష్మణకుమార్, సవరపు ప్రేమ్‌ను జగన్ కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారి చేతలను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా మాట్లాడారు. పదో తరగతి చదువుతున్న ప్రేమ్ తనపై జరిగిన దాడిని వివరించగా జగన్ చలించిపోయారు. జగన్ వస్తున్నారని తెలిసి కోనసీమ నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆస్పత్రి కిక్కిరిసిపోయింది.
కనీసం మనోధైర్యం కల్పించలేరా?
అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్ బాధితులపై విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరించిన తీరును తూర్పారబట్టారు. గురువారం రాజమహేంద్రవరం వచ్చిన చంద్రబాబు 60 కి.మీ.ల దూరంలో ఉన్న బాధితులను పరామర్శించడానికి రాలేరా? వారికి కనీసం మనోధైర్యం కల్పించలేరా? కేవలం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని నిప్పులు చెలరేగారు. ప్రివెన్షనల్ అట్రాసిటీ యాక్టు కింద బాధిత దళితులకు ఇవ్వాల్సిన గరిష్ఠ పరిహారం రూ.8.25 లక్షల ఒక్కొక్క బాధితునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇతరుల బాధలను తెలుసుకుంటా...
ఆస్పత్రి నుంచి జగన్ నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏయిర్‌పోర్టు వద్ద రాజమహేంద్రవరానికి చెందిన పేపరు మిల్లు కార్మికులు జగన్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. 35 మంది కార్మికులను యాజమాన్యం విధుల నుంచి తొలగించిందని కార్మికులు వాపోయారు. పక్కనే ఉన్న కన్నబాబుతో జగన్ మాట్లాడుతూ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయాలన్నారు. సూరంపాలెం ఎత్తిపోతల ప«థకం రైతులు కూడా జగన్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం మండల కన్వీనర్ తోరాటి శ్రీను ఆధ్వర్యంలో రైతులు జగన్‌తో మాట్లాడుతూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హాయాంలో ఈ ఎత్తిపోతల çపథకం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప«థకం ద్వారా సాగునీరందడం లేదని, ప్రస్తుత నేతలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని, ఎత్తిపోతల పథకం తీరుతెన్నులను పరిశీలించాలని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని జగన్ సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతాల రాజేశ్వరి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. జిల్లాలో గడపగడపకు వైఎస్సార్ జరుగుతున్న తీరును విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.