నెత్తురోడిన రహదారులు | accidents in east goadavari | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రహదారులు

Published Wed, Oct 26 2016 11:54 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

నెత్తురోడిన రహదారులు - Sakshi

నెత్తురోడిన రహదారులు

మృత్యువులోనూ వీడని తాతా మనుమల బంధం
నలుగురి మృతితో చొల్లంగిలో విషాదఛాయలు
జిల్లా రహదారులపై నెత్తురు పారింది. వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వెలుగుల పండుగ దీపావళికి నాలుగు రోజుల ముందు మూడు కుటుంబాల్లో విషాదపు చీకటి అలుముకుంది. బుధవారం పరీక్షలు రాయాల్సిన రంపచోడవరం లెనోరా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల్లో ఇద్దరు తెల్లవారుజామున బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో మృతి చెందారు. రంపచోడవరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి నిమిత్తం తల్లి హైదరాబాద్‌లో ఉండగా, తాళ్లరేవు మండలం చొల్లంగి అగ్రహారంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారులు రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారి అమ్మమ్మ, తాతయ్యలు కూడా అసువులు బాశారు.
తాళ్లరేవు: తల్లితండ్రులు దూరంగా ఉండడంతో తాతయ్య, అమ్మమ్మలతో అనుబంధం పెంచుకున్న ఆ చిన్నారులు మృత్యువులోనూ వారికి తోడయ్యారు. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జాతీయ రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో తాళ్లరేవు మండలం చొల్లంగి అగ్రహారం పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వనుము పోతురాజు (65), అతని భార్య పార్వతి (60) మనుమడు కర్రి ఆనంద్‌ (10), మనుమరాలు కర్రి దీవెన (9) మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవడంతో చొల్లంగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోతురాజుకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వారిలో మూడో సంతానమైన శ్రీదేవికి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.అయితే భర్తతో మనస్పర్థలు రావడంతో శ్రీదేవి భర్తను వదిలేసి తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది. అనంతరం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ పిల్లలకు కావాల్సిన సొమ్ము పంపుతోంది. ఆనంద్, దీవెన చొల్లంగి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. పోతురాజు, ఆయన తోడల్లుడు పంపన నారాయడు, భార్య రాజేశ్వరి వీరితో పాటుగా ఆటోడ్రైవర్‌ వెంట్రు అనిల్‌తో కలిసి బుధవారం ఉదయం ఏడు గంటలకు ఆటోలో గౌరీపట్నం బయలుదేరారు. దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వడిశలేరు వద్ద ఘోర ప్రమాదానికి గురై నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తమ మనస్సులను కలిచి వేస్తోందని గ్రామస్తులు అన్నారు. అటు తల్లి, తండ్రి లేనిలోటు తీరుస్తూ తాతా, అమ్మమ్మవద్ద ఆనందంగా గడుపుతున్నా చిన్నారులను బస్సు రూపంలో మృత్యువు కాటేసిందని బంధువులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు, కుమార్తె చనిపోయిన విషయాన్ని హైరరాబాద్‌లో ఉంటున్న తల్లి శ్రీదేవికి ఏ విధంగా చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. కనీసం పిల్లలను సాకుతున్న శ్రీదేవి చెల్లెలు శాంతకుమారికి సైతం ఈ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.  
మితిమీరిన వేగం బలి తీసుకుంది
రంపచోడవరం : మలుపులతో కూడిన ఏజెన్సీ రోడ్లు.. మితిమీరిన వేగం యువత ప్రాణాలను హరిస్తున్నాయి. రంపచోడవరం పాత ఆంధ్రా బ్యాంకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో స్థానిక లెనోరా ఇంజనీరింగ్‌ కళాశాల బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థులిద్దరు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బుర్రి నరేష్‌( 20),  జిల్లాలోని  బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన మసాబత్తుల అనిల్‌కుమార్‌ (21) ఉన్నారు. ఇదే ప్రమాదంలో తాళ్లరేవుకు చెందిన యువకుడు పందిరి రవికుమార్‌ గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి రంపచోడవరం నుంచి గోకవరం వైపు బైక్‌పై ముగ్గురు యువకులు వెళుతుండగా పాత ఆంధ్రా బ్యాంకు సమీపంలోని మలుపుతో బైక్‌ తప్పి పక్కన ఉన్న పుంత రోడ్డులోకి దూసుకువెళ్లింది. అక్కడే ఉన్న చెట్టును ఢీ కొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలారు. గాయపడిన రవికుమార్‌ తెల్లవారాక అక్కడకు దగ్గరలో ఉన్న సత్తెమ్మతల్లి గుడివద్దకు చేరుకుని అక్కడే ఉండిపోయాడు. ఏజెన్సీ రోడ్లపై అతివేగంగా ప్రయాణించడం ప్రమాదాలకు కారణం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement