goadavari
-
గోవా టూ గోదావరి.. కేడీ లేడీల లిక్కర్ దందా
కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా. తెలంగాణ కాదు.. గోవా బెటర్ గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు. వామ్మో కిలాడీ లేడీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్‌కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు. కొన్ని రైళ్లే కన్వినీయంట్ అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్‌లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. గస్తీ లేని స్టేషన్ల ఎంపిక గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు. లగేజీ మాటున లిక్కర్ ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు. ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్ ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు. లాభం ఎంతంటే.? గోవాలో ఫుల్‌బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం. – ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు -
నెత్తురోడిన రహదారులు
మృత్యువులోనూ వీడని తాతా మనుమల బంధం నలుగురి మృతితో చొల్లంగిలో విషాదఛాయలు జిల్లా రహదారులపై నెత్తురు పారింది. వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వెలుగుల పండుగ దీపావళికి నాలుగు రోజుల ముందు మూడు కుటుంబాల్లో విషాదపు చీకటి అలుముకుంది. బుధవారం పరీక్షలు రాయాల్సిన రంపచోడవరం లెనోరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఇద్దరు తెల్లవారుజామున బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో మృతి చెందారు. రంపచోడవరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి నిమిత్తం తల్లి హైదరాబాద్‌లో ఉండగా, తాళ్లరేవు మండలం చొల్లంగి అగ్రహారంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారులు రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారి అమ్మమ్మ, తాతయ్యలు కూడా అసువులు బాశారు. తాళ్లరేవు: తల్లితండ్రులు దూరంగా ఉండడంతో తాతయ్య, అమ్మమ్మలతో అనుబంధం పెంచుకున్న ఆ చిన్నారులు మృత్యువులోనూ వారికి తోడయ్యారు. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జాతీయ రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో తాళ్లరేవు మండలం చొల్లంగి అగ్రహారం పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వనుము పోతురాజు (65), అతని భార్య పార్వతి (60) మనుమడు కర్రి ఆనంద్ (10), మనుమరాలు కర్రి దీవెన (9) మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవడంతో చొల్లంగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోతురాజుకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వారిలో మూడో సంతానమైన శ్రీదేవికి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.అయితే భర్తతో మనస్పర్థలు రావడంతో శ్రీదేవి భర్తను వదిలేసి తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది. అనంతరం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ పిల్లలకు కావాల్సిన సొమ్ము పంపుతోంది. ఆనంద్, దీవెన చొల్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. పోతురాజు, ఆయన తోడల్లుడు పంపన నారాయడు, భార్య రాజేశ్వరి వీరితో పాటుగా ఆటోడ్రైవర్ వెంట్రు అనిల్‌తో కలిసి బుధవారం ఉదయం ఏడు గంటలకు ఆటోలో గౌరీపట్నం బయలుదేరారు. దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వడిశలేరు వద్ద ఘోర ప్రమాదానికి గురై నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తమ మనస్సులను కలిచి వేస్తోందని గ్రామస్తులు అన్నారు. అటు తల్లి, తండ్రి లేనిలోటు తీరుస్తూ తాతా, అమ్మమ్మవద్ద ఆనందంగా గడుపుతున్నా చిన్నారులను బస్సు రూపంలో మృత్యువు కాటేసిందని బంధువులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు, కుమార్తె చనిపోయిన విషయాన్ని హైరరాబాద్లో ఉంటున్న తల్లి శ్రీదేవికి ఏ విధంగా చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. కనీసం పిల్లలను సాకుతున్న శ్రీదేవి చెల్లెలు శాంతకుమారికి సైతం ఈ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మితిమీరిన వేగం బలి తీసుకుంది రంపచోడవరం : మలుపులతో కూడిన ఏజెన్సీ రోడ్లు.. మితిమీరిన వేగం యువత ప్రాణాలను హరిస్తున్నాయి. రంపచోడవరం పాత ఆంధ్రా బ్యాంకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో స్థానిక లెనోరా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులిద్దరు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బుర్రి నరేష్( 20), జిల్లాలోని బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన మసాబత్తుల అనిల్‌కుమార్ (21) ఉన్నారు. ఇదే ప్రమాదంలో తాళ్లరేవుకు చెందిన యువకుడు పందిరి రవికుమార్ గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి రంపచోడవరం నుంచి గోకవరం వైపు బైక్‌పై ముగ్గురు యువకులు వెళుతుండగా పాత ఆంధ్రా బ్యాంకు సమీపంలోని మలుపుతో బైక్ తప్పి పక్కన ఉన్న పుంత రోడ్డులోకి దూసుకువెళ్లింది. అక్కడే ఉన్న చెట్టును ఢీ కొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలారు. గాయపడిన రవికుమార్ తెల్లవారాక అక్కడకు దగ్గరలో ఉన్న సత్తెమ్మతల్లి గుడివద్దకు చేరుకుని అక్కడే ఉండిపోయాడు. ఏజెన్సీ రోడ్లపై అతివేగంగా ప్రయాణించడం ప్రమాదాలకు కారణం అవుతోంది.