కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్‌లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా.
తెలంగాణ కాదు.. గోవా బెటర్
గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు.
వామ్మో కిలాడీ లేడీస్
బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్‌కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు.
కొన్ని రైళ్లే కన్వినీయంట్
అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్‌టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్‌లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది.
గస్తీ లేని స్టేషన్ల ఎంపిక
గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్‌టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు.
లగేజీ మాటున లిక్కర్
ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్‌టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు.
ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్
ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్‌లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు.
లాభం ఎంతంటే.?
గోవాలో ఫుల్‌బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు.
అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం
స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం.
– ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు
Comments
Please login to add a commentAdd a comment