వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Published Fri, Aug 26 2016 9:09 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
బొబ్బర్లంక (ఆత్రేయపురం) :
వేర్వేరు సంఘటనల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మరణించారు. బొబ్బర్లంక ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ మహిళ వరణించగా, నలుగురికి గాయాలైనట్టు ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు. సీతానగరం మండలం ఉండేశ్వరపురానికి చెందిన కుటుంబం ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరైంది. పెళ్లి ముగిశాక ఈ కుటుంబం ఆటోలో తిరుగు ప్రయాణమైంది. బొబ్బర్లంక సమీపంలో రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన కోమలి సుశీల(44) అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ప్రయాణిస్తున్న మిగిలిన కుటుంబ సభ్యులు కోమలి మంగరాజు, కోమలి సూర్యకాంతంతో పాటు ఆటో డ్రైవర్ పీతల సన్నబాబు, బొబ్బర్లంకకు చెందిన ప్రయాణికుడు నూకల సుబ్రహ్మణ్యం గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జేమ్స్ తెలిపారు.
కారు ఢీకొని పూల వ్యాపారి
తుని : జాతీయ రహదారిలోని కొట్టాం సెంటర్ వద్ద కారు ఢీకొని పూల వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై బి.శంకర్రావు కథనం ప్రకారం.. స్థానిక కొండవారి పేటకు చెందిన మీలా కృష్ణ(45) స్థానిక గొల్ల అప్పారావు సెంటర్‌లో పూల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం అతడు కొట్టాం సెంటర్‌లో పూల బుట్టల కోసం వెళ్లాడు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు అతడిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఆ కారు ఆపకుండా వెళ్లిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రైలు నుంచి జారి పడి యువకుడు..
తుని : రైలు నుంచి జారి పడి 17 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు మరణించాడు. తుని జీఆర్పీ హెచ్‌సీ సింహాచలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం టి.తిమ్మాపురం వద్ద అప్‌లైన్‌లో గుర్తు తెలియని మృతదేహ ఉన్నట్టు శుక్రవారం కీమన్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్, రైలు టికెట్ లభించాయి. సూరత్ నుంచి ఒడిశా రాష్ట్రం బరంపురం వెళ్లేందుకు టికెట్ ఉంది. అందులో నిర్మల చందన్ నాయక్, జయా దీనా పేర్లు ఉన్నాయి. మృతుడి జేబులో లభించిన సెల్‌ఫోన్ నంబరుకు కాల్ చేయగా, నిర్మలచందన్ నాయక్ అనే వ్యక్తి మాట్లాడారు. బరంపురానికి టికెట్ తీశానని, యువకుడి వివరాలు తెలియదని చెప్పినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ఒyì శాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతదేహంపై నలుపు రంగు ప్యాంట్, నలుపు టీ షర్ట్, కట్ బనియన్ ఉన్నాయి. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement