వైరల్ ఫీవర్
జిల్లాలో 92 డెంగీ కేసులు నమోదు
అనధికారికంగా మరో నాలుగురెట్ల బాధితులు
తీవ్రత ఉన్న గ్రామాల్లో వైద్యశిబిరాలు
కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేకవార్డు
జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య
రాయవరం : జిల్లాలో ప్రస్తుతం వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయని, ఇప్పటి వరకూ అధికారికంగా 92 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎం అండ్ హెచ్‌ఓ) డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. అనధికారికంగా 400 వరకు డెంగీ కేసులు ఉండవచ్చన్నారు. ఆయన గురువారం రాయవరం పీహెచ్‌సీని సందర్శించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురం, కాకినాడ రూరల్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లుగా గుర్తించామన్నారు. డెంగీ తీవ్రత ఉన్నట్టు గుర్తించిన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో 645 వైద్య శిబిరాల నిర్వహణ లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 280 శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మందుల కొరత లేదని, జ్వరాల నియంత్రణకు కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు, చిన్నారులకు ప్రత్యేకంగా పీఐసీయూ ఏర్పాటు చేశామని చెప్పారు. జ్వరాల నియంత్రణకు దోమల నిర్మూలన ఒక్కటే మార్గమని, పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటే నియంత్రణ సాధ్యమని చెప్పారు.
ప్రసవాలు జరగని పీహెచ్‌సీలు 24..
జిల్లాలో లక్ష ప్రసవాలకు 34 మంది తల్లులు, 74 మంది చిన్నారుల మరణాలు సంభవిస్తున్నట్లు డీఎం అండ్‌హెచ్‌ఓ తెలిపారు. మరణాల్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరగడం లేదన్నారు. రామచంద్రపురం డివిజన్‌లో రాయవరం, రామవరం, కొంకుదు, వాకతిప్ప పీహెచ్‌సీల్లో జీరో ప్రసవాలు నమోదయ్యాయన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా గర్భిణుల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన ప్రవేశ పెట్టిన జూలై నెలలో 5,646 మంది, ఆగస్టులో 8 వేల మంది గర్భిణులను పరీక్షించామన్నారు. ఈ నెలలో 10 వేల మందిని పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.