మూగజీవాలపై ఉన్న ప్రేమ..మనుషులపై లేదా?
-
సూదాపాలెం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేయాలి
-
రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
అమలాపురం :
‘మూగజీవాలపై ఉన్న ప్రేమ.. మనుషులపై లేకుండా పోయిందా? గో సంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సమంజసమేనా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. సూదాపాలెం ఘటనలో కొన్ని సంస్థల పేర్లు వినిపిస్తున్నందున ప్రత్యేక దర్యాప్తు చేయాలి’ అని వివిధ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. స్థానికి జానికీపేటలో శనివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కుల వ్యతిరేక పోరాట సంఘం, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐల ప్రతినిధులు పాల్గొన్నారు. సీపీఎం డివిజన్ కార్యాదర్శి మోర్తా రాజశేఖర్, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గో సంరక్షణ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్, వీహెచ్‌పీల ఆగడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బంధీగా అమలు చేయాలని, చట్టపరంగా బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బొమ్మి ఇజ్రాయిల్, పి.వసంతకుమార్, టి.నాగవరలక్ష్మి, చిట్టిబాబు, ఎ.శ్రీనివాస్, మడికి శ్రీరాములు పాల్గొన్నారు.
త్వరలో ఛలో అమలాపురం
సూదాపాలెం ఘటనకు నిరసనగా త్వరలో ఛలో అమలాపురం నిర్వహిస్తామని దళిత ఐక్యవేదిక ప్రకటించింది. స్థానిక ప్రీతి లాడ్జిలో శనివారం ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఐక్యవేదిక చైర్మన్ డీబీలోక్ మాట్లాడుతూ ఛలో అమలాపురం తేదీని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. దళితులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి కాకుండా దాడులకు పాల్పడినవారి వద్ద నుంచి పరిహారం వసూలు చేయాలన్నారు. అలా చేస్తేకాని భవిష్యత్తులో ఇలాంటి దాడులను అరికట్టలేమన్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. చనిపోయిన పశువుల మృతదేహాలను కులవృత్తులు వారు కాకుండా పశువుల యజమానులే స్వయంగా ఖననం చేసుకోవాలని, మతతత్వ శక్తులైన ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్, గో సంరక్షణ సమితులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కో ఆర్డినేటర్ ఉండ్రు బాబ్జి, కన్వీనర్ జంగా బాబూరావు, పి.చిట్టిబాబు, నక్కా సంపత్ కుమార్, పశ్చిమాల వసంతకుమార్, కారం వెంకటేశ్వరరావు, కుంచే స్వర్ణలత, సాధనాల వెంకట్రావు, ఎం.ఎ.కె.భీమారావు, మట్టా వెంకట్రావులు పాల్గొన్నారు.