జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
నీవు మమ్మల్ని విడిచి ఏళ్లు గడిచిపోయాయి....నీ జ్ఞాపకాలు కళ్ల ముందే కదలాడుతున్నాయి. నువ్విచ్చిన వరాలే మమ్మల్ని బతికిస్తున్నాయి. అయ్యా గూడు లేదంటే ఇందిరమ్మ ఇంటి కింద నీడ కల్పించావు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో నిరుపేద విద్యార్థుల జీవితాల్లో విద్యావెలుగులు ప్రసరించావు...ఓ అమ్మకు పెద్ద కొడుకుగా ఆసరాగా నిలుస్తూ పింఛన్ అందజేశావు...గుండె పగిలిన అయ్యకు ఆరోగ్యశ్రీతో ప్రాణభిక్ష పెట్టావు. రైతుల దగ్గర నుంచి విద్యార్థుల వరకూ, పసిపాప నుంచి పండుటాకు వరకూ అందరి అభిమానాన్ని చూరగొన్నావు.
అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యావు. ముఖ్యమంత్రిగా కంటే కుటుంబ సభ్యునిగా, ఆత్మీయునిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయావు. అయితే నువ్వు అమలు చేసిన పథకాలన్నీ నీరు గారిపోతున్నాయి. మేము క్షేమంగా ఉండాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి. మంగళవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన్ను తలచుకుంటూ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలనునిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.
విజయనగరం టౌన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సంక్షేమ పథకాల అమలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలోవిలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ వర్ధంతి సభలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.జిల్లాకేంద్రంలోని పూల్‌భాగ్‌లో ఉన్న ప్రేమ సమాజంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అనంతరం ద్వారకామయి అంధుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలతో పాటు పట్టణంలో పలుచోట్ల వర్ధంతి సభలు జరగనున్నట్టు తెలిపారు.