మీకేం కాదు..మేమున్నాం
సాక్షి ప్రతినిధి, కడప:
రేషన్ డీలర్ల వ్యవహారంలో అక్రమ ఆదాయానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విధివిధానాలు రూపొందిస్తోంది. అమలు చేయాల్సిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో నీరుగారుస్తోంది. అక్రమార్కులకు దొరల మార్గాన్ని చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. చేతులు బరువెక్కడంతో ోగస్ ఏరివేతకు రెవిన్యూ యంత్రాంగం మంగళం పలుకుతున్నారు. దీంతో రేషన్‌షాపు డీలర్ల అక్రమ ఆదాయానికి డోకా లేకుండా పోతోంది.
జిల్లాలో 6.85లక్షల రేషన్ కార్డులు, 50వేల పైచిలుకు అంత్యోదయ కార్డులున్నాయి. ఇందుకుగాను 1704 చౌకదుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందుతున్నాయి. వీటి పరిధిలో బోగస్ కార్డులను ఇదివరకే నాలుగు విడతల్లో ఏరివేత నిర్వహించారు. అప్పట్లో 50వేల వరకూ బోగస్ కార్డులున్నట్లు గుర్తించారు. కాగా రేషన్ కార్డులను ఆధార్ ద్వారా సీడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. తద్వారా బోగస్ కార్డుల సమస్య ఉత్పన్నం కాదని భావించింది.
వాస్తవంగా ఆధార్ సీడింగ్ నిర్వహించడం ద్వారా బోగస్ ఏరివేతకు మార్గం సుగమం అవుతుంది. రేషన్‌కార్డుదారుల నుంచి డీలర్లు ఆధార్ కార్డులు సేక రించారు. ఆధార్ ఇవ్వకపోతే బియ్యం మంజూరు కావని తెలియడంతో నిరుపేద కుటుంబాల వారు ఆధార్ సీడింగ్‌కు సహకరించారు. ఒక్కొక్క రేషన్ డీలర్ పరిధిలో 10 నుంచి 20 శాతం కార్డులు ఆధార్ సీడింగ్ కాలేదు. అలాంటి లబ్ధిదారుల జాబితాకు బియ్యం కోటా నిలిపేశారు. వారిలో కొందరు సకాలంలో ఆధార్ అందించకపోగా, తక్కినవి బోగస్ కార్డులుగా తెలుస్తోంది.
ఆధార్ లేకపోతే రేషన్ నిలిపాం:
ఏఎస్‌ఓ సుబ్బారెడ్డి
ఆధార్ సీడింగ్ కాకపోతే రేషన్ నిలిపిన విషయం వాస్తవమే. బోగస్ కార్డులకు పక్క రాష్ట్రాల నెంబర్లు వేస్తున్నారన్న విషయం ఇప్పుడే తెలుస్తోంది. ఈవిషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వరద సహాయక కార్యక్రమాలకు వెళ్లిన డీఎస్‌ఓ రాగానే ఆయన దృష్టికి తీసుకెళతాం. అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్‌లతో పాటు రెవిన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం.
చేతివాటం ప్రదర్శిస్తున్న రెవెన్యూ యంత్రాంగం....
రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ విధానాన్ని నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులకు రేషన్ కోత విధించారు. దీంతో నీటిలోని చేప ఒడ్డున పడ్డట్లుగా రేషన్ డీలర్లు గిలగిలలాడిపోయారు. వారి పరిధిలోని బోగస్ కార్డులకు ఆధార్ సీడింగ్ ఎలా సాధ్యమో దారి చూపాలంటూ అభ్యర్థనలు మొదలయ్యాయి. దీంతో రెవెన్యూ యంత్రాంగం రేషన్ డీలర్ల మధ్య ఒప్పందం కుదిరింది.
అందులో భాగంగా ఆధార్ 14అంకెల సంఖ్యను బోగస్ కార్డులకు పొందుపరుస్తున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆధార్ నెంబర్లను బోగస్ కార్డులకు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కొక్క కార్డుకు రూ. వంద చొప్పున నూరు బోగస్ కార్డులు కల్గిన రేషన్ డీలర్ రూ.10వేలు సమర్పిస్తే వ్యవహారం చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలాలలో జరుగుతున్న ఈ తతంగం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పాకుతున్నట్లు సమాచారం.