వారికి బుద్ధి చెప్పేందుకే...సకల జన భేరి | You can sense them ... Jan drum | Sakshi
Sakshi News home page

వారికి బుద్ధి చెప్పేందుకే...సకల జన భేరి

Published Fri, Sep 27 2013 3:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

You can sense them ... Jan drum

సుబేదారి, న్యూస్‌లైన్ : తెలంగాణ ఇస్తామని ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగానే టీఎన్జీవోలు కదనరంగంలోకి దూకాల్సి వస్తోందని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యమం మళ్లీ ఉధృతరూపం దాల్చకముందే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో టీఎన్జీఓల భేరి సభ గురువారం జరిగింది.

జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా దేవీప్రసాద్ మాట్లాడారు. టీఎన్జీఓ అన్న నాలుగు అక్షరాల పోరాటానికి రూపమే సకల జన భేరి అని తెలిపారు. సచివాల యంలో మూడు వేల మంది సీమాంధ్ర అధికారులు ఉంటే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు 800 మంది మాత్రమే ఉన్నారని, దీన్ని నిరసిస్తూ సచివాలయంపై తెలంగాణ జెండా ఎగురవేయడానికి సకలజన భేరి సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ప్రకటన చేసినప్పటికీ... ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ, పాలకులు అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నందున అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని పార్టీల నేతలు ఒక్కటి కావడమే కాకుండా కేంద్రం యూ టర్న్ తీసుకునేలా వివిధ యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కారణంగానే తెలంగాణలో మళ్లీ బలిదానాలు చోటుచేసుకుంటున్నాయని, బిడ్డలకే తల్లిదండ్రులు తలకొరివి పెట్టాల్సిన  దుస్థితి సీమాంధ్ర నాయకుల వల్ల ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రతి దానికీ గడువే...

 ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యలే కాదు, ఏ విషయమూ స్పష్టం తెలియదని దేవీప్రసాద్ ఎద్దేవా చేశారు. పదో పీఆర్సీ చైర్మన్ కొన్ని అంశాలపై సమాధానం చెప్పాలని లేఖ పంపితే రెండు నెలల గడువు అడిగారని గుర్తు చేశారు. ఇక రాజ్యాంగ వ్యతిరేకంగా సమ్మె ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే రెండు వారాల అడిగారని.. ఇలా సమ్మె ఎందుకు చేస్తున్నారో చెప్పలేని వ్యక్తి నాయకుడెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. విభజన వద్దంటూ మూర్ఖపు వాదనకు దిగుతున్న అశోక్‌బాబు వంటి వారికి బుద్ధి చెప్పడమే కాకుండా స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఈనెల 29న తెలంగాణ సకల జనభేరి నిర్వహిస్తున్నామని దేవీప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణను ఇందు లో ప్రకటిస్తామని వివరించారు.

 టీఎన్జీఓల స్ఫూర్తితోనే ఉద్యమంలోకి... : కడియం

 తాను టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లోకి రావడానికి టీఎన్జీఓలే స్ఫూర్తి అని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు టీఎన్జీవోల నేత పరిటాల సుబ్బారావు చేసిన విజ్ఞప్తితో పాటు.. స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికల సందర్భంగా అభివృద్ధి పనులను వివరించినా తెలంగాణ ఉద్యమంలో లేరు కదా అంటూ ప్రశ్నించిన ఉపాధి హమీ కూలీల సూచనలు ఆలోచనకు పురిగొల్పాయని వివరించారు. తాను టీఆర్‌ఎస్‌లోకి రాగానే, తెలంగాణ ప్రకటన రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రకటన రావడానికి కానీ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి కానీ టీఎన్జీవోలే కారణమని కొనియాడారు. చరిత్ర తెలియన అజ్ఞాని, ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు.. నిజాంకాలంలో తెలంగాణ ప్రజలు బానిసలని చెప్పడం గర్హనీయమని కడియం పేర్కొన్నారు. అయితే, నిజాం కాలంలో ఆ బానిసలే బందూకులు పట్టుకుని రాజులను తరిమినట్లుగా అశోక్‌బాబుకు జరగకుండా చూసుకోవాలని సూచించారు.

తెలంగాణ కోసం టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నాయకులు పోరాడిన సమయంలో టీ టీడీపీ ఫోరం నేతలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని శ్రీహరి ప్రశ్నించా రు. సీమాంధ్ర రాజకీయ పార్టీల వైఖరిని తెలియజేయడానికి, సీమాంధ్ర దుష్ర్పచారాన్ని తిప్పికొట్టడానికితెలంగాణ సకలజనుల  భేరి సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు వరంగల్ నుంచి 20వేల మందిని హైదరాబాద్‌కు తరలించునున్నామని కడియం వివరించారు.
 మీడియా, పత్రికలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎత్తిచూపుతున్నాయి

 - టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన
 కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి
 సీమాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నాయని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ వైఖరిని వారు మార్చుకోవాలని సూచించారు. అలాగే, తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లు వెంటనే  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. టీఎన్జీఓల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణ ప్రజలదే, దీన్ని చాటిచెప్పడానికే నిజాం కాలేజీలో తెలంగాణ సకల జనుల భేరి  నిర్వహిస్తున్నామన్నారు.

తెలంగాణ లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెనక్కితీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులను ఆదుకోవడానికి సహకరించిన టీఎన్జీవోలకు టీఆర్‌ఎస్ ఎప్పటికీ రుణ పడి ఉంటుందన్నారు.

 పాట, మాటలతో ఉత్తేజపరిచిన సురేందర్
 నంది అవార్డు గ్రహీత, జిల్లా వాసి, సినీ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ తన మాట, పాటలతో టీఎన్జీవోల భేరి సభను ఉత్తేజపరిచారు. తెలంగాణకు అడ్డుపడుతున్నాడని చంద్రబాబుపై, మౌనంగా ఉంటున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రశ్నిస్తూ పాట పడిన ఆయన.. ఇక్కడ పుట్టిన మహానుభావులను కీర్తిస్తూ కూడా పాట పాడారు. అనంతరం సకల జనుల భేరి సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో టీఎన్జీఓల రాష్ట్ర నాయకురాలు రేచల్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, ఇంజినీర్ల సంఘం నాయకుడు శివాజీ మాట్లాడగా, శ్రీనివాస్, అసనుద్దీన్, సాదుల ప్రసాద్, ఇబ్రహీం హుస్సేన్, సదానందం, రత్నాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్, సంపత్‌రావు, స్వర్గం హరి, సాంబయ్య, అబ్దుల్లా, జహంగీర్, రాగి శ్రీనివాస్, దాస్యానాయక్, ఉపేందర్‌రెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు, ప్రతాప్, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement