భామిని: పుట్టిన ఊరులో జీవనోపాధి లేక హైదరాబాద్ వలస వెళ్లిన ఓ కుటుంబానికి అక్కడా పేదరికమే పలకరించింది. సరైన వైద్యం అందించే స్థోమత లేక ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగింది. వివరాళ్లోకి వెళితే.. భామిని మండలం బాలేరుకు చెందిన లిమ్మల వసంతరావు, ఝాన్సీ దంపతులు స్వగ్రామంలో బతుకు నడవక హైదరాబాదుకు వలస వెళ్లారు. వీరికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇంటర్ పూర్తిచేసిన కుమారుడు లిమ్మల ప్రేమకుమార్(20) ఉన్నారు.
వీరంతా హైదరాబాదులో రోజుకూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సక్రమంగా పనులు దొరక్కపోవడంతో డబ్బులేక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రేమకుమార్ ఆరోగ్యం క్షీణించింది. సరైన వైద్యం అందించేందుకు డబ్బులు లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో ప్రేమకుమార్ గురువారం రాత్రి హైదరాబాద్‌లో మృత్యువాతపడినట్లు స్వగ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందింది. కేవలం పేదరికం కారణంగా అందికొచ్చిన కుమారుడు చనిపోవటంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. మృతదేహం స్వగ్రామం బాలేరు చేరుకోవడంతో శనివారం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment