రమ్యకృష్ణారెడ్డి , నారాయణరెడ్డి (ఫైల్)
భర్తే హత్య చేశాడంటున్న
మృతురాలి బంధువులు
అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన ఓ వివాహిత ఆదివారం బెంగళూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగి జి.చంద్రశేఖర్‌రెడ్డి రెండో కుమార్తె రమ్యకృష్ణారెడ్డి (30)ని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తలుపులకు చెందిన నారాయణరెడ్డికి ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. రమ్యకృష్ణారెడ్డి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో పనిచేస్తోంది. వివాహం తర్వాత కొద్దికాలం ఆనందంగా గడిచిన వీరి సంసారంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. నారాయణరెడ్డి రోజూ రమ్యకృష్ణారెడ్డిని వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె ఏడాదిన్నర క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి పుట్టింటిలోనే ఉంటోంది.
నాలుగుల రోజుల క్రితం కుమారుడిని పుట్టింటిలోనే వదిలి భర్త వద్దకు వెళ్లింది. తల్లిదండ్రలు వారించినా తన భర్తతో తానే మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటామని చెప్పి వెళ్లింది. అయితే ఆదివారం ఉదయం 11.25 గంటల సమయంలో తాను మార్కెట్టు వెళ్తున్నానంటూ.. రమ్యకృష్ణారెడ్డి అనంతపురంలో ఉన్న బంధువులకు మెసేజ్ పంపింది. 12.45 గంటలకు రమ్యకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకుందంటూ.. తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న అల్లుడు నారాయణరెడ్డిని నిలదీయగా 11.30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. అయితే 11.25 గంటల సమయంలో మార్కెట్టు వెళ్తున్నట్లు తనకు మేసేజ్ పెట్టిన తమ బిడ్డ ఐదు నిమిషాల్లోనే ఇంట్లో ఎలా ఉరి వేసుకుంటుందని రమకృష్ణారెడ్డి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రమ్యకృష్ణారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తన కుమార్తె మృతికి అల్లుడే కారణమంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.