
అన్నను హత్య చేసిన తమ్ముడు
ఒంగోలు క్రైం : వివాహేతర సంబంధం నేపథ్యంలో అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేయడంతో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నగరం పరిధిలోని పేర్నమిట్టలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక క్రిస్టియన్‌పాలేనికి చెందిన గుండె కోటయ్య (48)కు, ఆయన తమ్ముడు జయరావుకు కొంతకాలంగా మనస్పర్థలున్నాయి. పక్కపక్కనే నివాసం ఉంటూ ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన తమ్ముడు జయరావు గొడ్డలితో అన్న కోటయ్యపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నదమ్ముల మధ్య కుటుంబ కలహాలతో పాటు వివాహేతర సంబంధం విషయంలో కూడా వివాదం ఉన్నట్లు సమాచారం.
గతంలో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి గొడవలు లేకుండా చేశారు. తమ్ముడు జయరావు పెద్దల మాటలు లెక్క చేయకుండా యథావిధిగా సంబంధం కొనసాగిస్తుండటంతో అతని గొడ్డలి వేటుకు అన్న బలయ్యాడు. కోటయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతితో కుమార్తెలు రమాదేవి, సౌజన్య, మాధవి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు జయరావు పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ ఐ.శ్రీనివాసన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.