సమగ్ర దర్యాప్తునకు కేంద్ర హోంశాఖను ఆదేశించండి | YS Jagan Additional petition in the High Court | Sakshi
Sakshi News home page

సమగ్ర దర్యాప్తునకు కేంద్ర హోంశాఖను ఆదేశించండి

Published Sat, Nov 24 2018 4:22 AM | Last Updated on Sat, Nov 24 2018 5:37 AM

YS Jagan Additional petition in the High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రతా చట్టం పరిధిలోకి వస్తుందని, అందువల్ల ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, పౌర విమానయాన భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికార పరిధి జాతీయ భద్రతా విభాగానికి(ఎన్‌ఐఏ) ఉందని పేర్కొన్నారు. ఈ హత్యాయత్నం ఘటన తాలూకు పూర్తి సమాచారాన్ని, నివేదికను రాష్ట్ర పోలీసులు కేంద్ర హోంశాఖకు పంపాల్సి ఉన్నా, ఇప్పటివరకూ పంపలేదని న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల సంబంధిత నివేదికను, సమాచారాన్ని వెంటనే కేంద్రానికి పంపేలా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఎయిర్‌పోర్ట్‌ విమానాశ్రయ ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. 

న్యాయస్థానానికి అదనపు సమాచారం 
విశాఖ విమానాశ్రయంలో అక్టోబర్‌ 25న తనపై జరిగిన హత్యాయత్నంపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి, డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఈ మొత్తం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. తాను దాఖలు చేసిన వ్యాజ్యానికి అనుబంధంగా జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులో మరింత అదనపు సమాచారాన్ని, కీలక చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయన్న అంశాలను పొందుపరిచారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయొచ్చు 
‘‘పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు 1982లో చట్టం వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 3, 3ఎ ప్రకారం.. ఏ విమానాశ్రయంలోనైనా ఉద్దేశపూర్వకంగా, చట్ట విరుద్దంగా ఏదైనా ఆయుధాన్ని, పరికరాన్ని ఉపయోగించినా, హింస ద్వారా ఎవరైనా వ్యక్తిని గాయపరిచినా, హతమార్చినా, ఏదైనా విమానాన్ని నాశనం చేసినా, తీవ్రంగా నష్టపరిచినా, విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించినా, విమానాశ్రయం భద్రతకు ప్రమాదంగా పరిణమించినా, బెదిరింపులకు పాల్పడినా అందుకు బాధ్యుడైన వ్యక్తికి జీవిత ఖైదు విధించవచ్చు. ఈ నేరాలపై సెక్షన్‌ 5ఎ ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి దర్యాప్తు చేయవచ్చు. సీఆర్‌పీసీ కింద ఓ పోలీసు అధికారికి ఉండే అధికారాలన్నీ ఈ సెక్షన్‌ కింద నియమితులయ్యే అధికారులకు ఉంటాయి. కేంద్రం నియమించే అధికారికి రాష్ట్ర పోలీసులు సహకరించాల్సి ఉంటుంది’’ అని అనుబంధ పిటిషన్‌లో జగన్‌ పేర్కొన్నారు. 

ఎన్‌ఐఏకు దర్యాప్తు జరిపే పరిధి ఉంది 
‘2008లో ఎన్‌ఐఏ చట్టం వచ్చింది. ఈ చట్టం కింద పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలపై దర్యాప్తు జరిపే పరిధి ఎన్‌ఐఏకు ఉంది. విమానాశ్రయంలో చట్ట విరుద్ధ కార్యకలాలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. ఆ తరువాత ఆ సమాచారాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఘటన తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించాలా? లేదా? అన్న దానిపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంది. నాపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి పంపనే లేదు. విమానాశ్రయాల్లో ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలో చట్టం నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ విఫలమయ్యారు 
‘‘రాష్ట్ర హోంశాఖ, డీజీపీ తదితరులు వారి చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారు. అంతేకాక చట్ట నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక తెప్పించుకోలేదు. ఈ అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని నాపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన తాలూకు సమాచారాన్ని, నివేదికను కేంద్ర హోంశాఖకు పంపేలా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించండి. దాని ప్రకారం హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించండి’’ అని హైకోర్టును జగన్‌ అభ్యర్థించారు. 

విచారణను వాయిదా వేయండి: ఏజీ 
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌ నవంబర్‌ 27న విచారణకు రానున్న నేపథ్యంలో ఆ వ్యాజ్యం గురించి రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 27వ తేదీన తనకు సుప్రీంకోర్టులో పోలవరం కేసుల విచారణ ఉందని, అందువల్ల జగన్‌ పిటిషన్‌ విచారణను ఆపై వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసే అంశాన్ని 27న పరిశీలిస్తామని స్పష్టం చేసింది. 

దర్యాప్తుపై తదుపరి చర్యలన్నీ నిలిపేయండి 
హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ‘పిల్‌’ 
విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. హత్యాయత్నంపై దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విన్నవించారు. అలాగే డీజీపీ, సిట్‌ ఇన్‌చార్జి, విశాఖ పోలీస్‌ కమిషనర్, ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓలను ప్రాసిక్యూట్‌ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు. జగన్‌పై హత్యాయత్నంపై రాష్ట్ర పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement