
సాక్షి, అమరావతి: ఇసుక కొరత తాత్కాలికమేనని, నవంబర్ ఆఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని భావిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని, ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు – భవనాల శాఖ సమీక్ష సందర్భంగా ఇసుక లభ్యత గురించి మాట్లాడారు. గత 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని, 267 రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని, మిగతావన్నీ వరద నీటిలో ఉన్నాయన్నారు. వరద నీటిలో ఉన్న రీచ్‌ల నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉందని, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా 90 రోజులుగా వరద వస్తోందని, ఇలా నీళ్లు రావడం రైతులకు, పంటలకు, భూగర్భ జలాలకు మంచిదేనని, కాకపోతే నిరంతరం వరద వల్ల ఇసుక సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని, పొక్లెయిన్లు, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగించి భారీగా దోపిడీ చేశారని.. ఇప్పుడు మాన్యువల్‌గా చేస్తున్నామనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పుడు మీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్లి చూసినా.. గేట్లు ఎత్తే ఉన్నాయని, వరద నీరు ప్రవహిస్తూనే ఉందని చెప్పారు. గత ఐదేళ్లలో పేరుకే ఇసుక ఉచితం అని చెబుతూ.. వాస్తవానికి మాఫియా నడిపారని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాము చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని, ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని, కిలోమీటర్‌కు రూ.4.90కి ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment