
ప్రభం‘జనం’
వైఎస్ జగన్ దీక్షకు తరలివస్తున్న గ్రామాలు
ప్రతి ఇంటా, రచ్చబండల వద్ద ‘ప్రత్యేక’ చర్చ
ప్రతిపక్షనేతకు అండగా ఉంటామని ప్రతిన
కనకదుర్గమ్మ ఆలయాల్లో మహిళల పూజలు
పెరుగుతున్న ప్రజా సంఘాల మద్దతు
జగన్‌ను కలుస్తున్న మేధావులు, విద్యాసంస్థల అధిపతులు
పల్లెలన్నీ కూడబలుక్కున్నట్టు.. ఊళ్లన్నీ ఏకమైనట్టు... ఏకతాటిపై నిలిచినట్టు ... మూకుమ్మడిగా మునుముందుకు కదులుతున్నాయి..
ప్రవాహంలా జన ప్రభంజనమై వస్తున్నాయి..! జననేత దీక్షకు మద్దతు తెలిపేందుకు.. ప్రత్యేక హోదా సాధనలో భాగస్వాములయ్యేందుకు.. పనులన్నీ పక్కనపెట్టి... రహదారుల బాటపట్టి.. సమరోత్సాహంతో సైదోడుగా నిలుస్తున్నాయి.. కర్షకులు.. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు .. వాగూవంకా, చెలమా ఏరు కలసి విస్తరించినట్టు... వందలా.. వేలా, వే వేలు... లక్షల జేజేలు..
మేలు కోరేవాడంటూ మనసారా దీవెనలు..
గుంటూరు : ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వేదికగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు గ్రామాలకు గ్రామాలే తరలివస్తున్నాయి. దీనిని ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంగా భావించకుండా తమ భవిష్యత్‌కు సంబంధించినదిగా భావిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు జగన్ పోరాటానికి అండగా ఉంటామ ని ప్రతిన బూనుతున్నారు. ప్యాకేజీల పేరుతో ప్రజల్ని మరోసారి మోసగించే టీడీపీ ప్రయత్నాలను నిలువరించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతీ ఇంటా, రచ్చబండల వద్ద జగన్ దీక్షపై చర్చలు సాగుతున్నాయి.
ప్రతి గ్రామంలో ప్రత్యేక హోదాపై చర్చ...
‘‘ప్రత్యేక హోదా వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయి. సాగునీటి కొరత తీరుతుంది. ఎకరాకు 40 బస్తాల దిగుబడి సాధించవచ్చు. వీటి కోసం కేంద్రం విడుదల చేసే గ్రాంటులో 90 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామ రైతు కొల్లి శివరామిరెడ్డి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కలిగిస్తున్నాడు. ఇలా ప్రతీ గ్రామంలో అవగాహన చర్చలు సాగుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్ని సైతం పక్కన పెట్టి జగన్ దీక్షకు తరలివస్తున్నారు. మేధావి వర్గానికి చెందిన విద్యావేత్తలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు రోజువారీ విధులు ముగించుకుని సాయంత్రం వేళ దీక్షా శిబిరానికి చేరుకుంటున్నారు. కొందరు యూనివర్సిటీ, కళాశాల విద్యార్థులు తరగతులు పూర్తయిన తరువాత దీక్షాస్థలికి వస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామికీకరణ జరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉండటంతో తమ భవిష్యత్ కోసం జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతున్నారు. ప్రధానంగా మహిళలు, యువతరం భారీగా తరలివస్తున్నారు. కొందరు మహిళలు కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించి జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ఫలించాలనీ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు.
దూరప్రాంతాల నుంచి సైతం బస్సుల్లో...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఉదయం నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరితోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాలు దీక్షా శిబిరానికి బారులు తీరాయి. దీక్షాస్థలి నల్లపాడుకు సమీప నియోజకవర్గాలైన తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడుల నుంచి అభిమానులు, కార్యకర్తలు ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై తరలివస్తే, దూరప్రాంత నియోజకవర్గాల నుంచి ప్రైవేట్ బస్‌ల్లో వచ్చి జననేతను కలిసి హోదా సాధించాలనీ, తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని భరోసానిస్తున్నారు. అంతకు ముందు వీరంతా తమ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి ఇక్కడకు చేరుకున్నారు. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలిచ్చారు. జగన్ దీక్షకు మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక హోదా తో లభించనున్న ప్రయోజనాలు, ప్యాకేజీ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించారు.