'మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటు' | YS Jagan mohan reddy condolence to malli mastan babu family menbers | Sakshi
Sakshi News home page

'మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటు'

Published Wed, Apr 15 2015 3:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటు' - Sakshi

'మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటు'

  •  ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  •  భావితరాలకు గుర్తుండిపోయే వ్యక్తి
  •  పపంచదేశాల్లో భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేశారు
  •  ఆయన స్మారక స్తూపం ఏర్పాటు చేయాలి
  •  కుటుంబసభ్యుల్ని ఆదుకుంటాం
  •  మస్తాన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తా
  •  పభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి
  •  
    సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత మస్తాన్‌బాబుకే దక్కింది. ఇటువంటి వ్యక్తి భారత్‌లో ఉండటం దేశానికే గర్వకారణం’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు ధైర్యసాహసాలను కొనియాడారు. చిలీ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రమాదవశాత్తు పదిరోజుల క్రితం మృత్యువాత పడ్డ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగానికి చెందిన మస్తాన్‌బాబు కుటుంబాన్ని ఆయన స్వగ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు.
     
    ఈ సందర్భంగా జగన్.. మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ, సోదరి పెద్దమస్తానమ్మ, సోదరులు పెద్ద మస్తానయ్య, చిన్నమస్తాన్‌బాబులను పేరుపేరున పలకరించారు. మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటన్నారు. భావితరాలకు గుర్తుండిపోయేలా ఆయన స్మారకస్తూపం ఏర్పాటుచేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మస్తాన్‌బాబు మృతదేహాన్ని చిలీ నుంచి త్వరగా తీసుకొచ్చేలా తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని, ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేసి సమాచారమిస్తే అన్నివిధాలా ఆదుకుంటానని జగన్ భరోసా ఇచ్చారు. అంతేగాక తన ఫోన్ నంబర్‌ను మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు పేపర్‌పై రాసి ఇచ్చారు.
     
    ప్రభుత్వం కూడా మస్తాన్‌బాబు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని జగన్ కోరారు. మస్తాన్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన విజిటర్స్ పుస్తకంలో ‘మస్తాన్‌బాబు మృతి బాధాకరం. ఆయన మృతి దేశానికి తీరనిలోటు’ అని రాశారు. అదేవిధంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ‘మల్లి మస్తాన్‌బాబు రికార్డులు దేశ ప్రతిష్టను ప్రపంచదేశాల్లో సగర్వంగా నిలబెట్టాయి. అతని మృతి తీరని లోటు’అని పేర్కొన్నారు. మస్తాన్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.  
     
    అంబేడ్కర్‌కు నివాళులు..
     డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయుడుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి నివాళులర్పించారు.
     
    వివాహ వేడుకలకు హాజరు..
     అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కుమార్తె దీప్తి వివాహ కార్యక్రమానికి జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అల్లూరులోని విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో పెళ్లికుమార్తె దీప్తిని ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement