కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు వాయిదా
ముంబై వెళ్లిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. రతన్ టాటా చిత్రపటానికి ముఖ్యమంత్రి, మంత్రులు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప దాతృత్వ సేవలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌తో రతన్ టాటాను సత్కరించిందని కొనియాడారు. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారన్నారు.
రతన్ టాటా మృతి నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో చర్చించాల్సిన అజెండాను వాయిదా వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబై బయలుదేరి వెళ్లారు.
దేశానికి తీరని లోటు: పరిశ్రమల శాఖ
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఘన నివాళి అర్పించింది. మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో రతన్ టాటాకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రతన్ టాటా తన జీవితం చివరి వరకు విలువలు పాటించి ఎంతో సాధారణ జీవితం గడిపారన్నారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అడిషనల్ ఏవీ పటేల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment