
రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరం: బాలశౌరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉద్ఘాటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సరైన నాయకత్వం, దశ, దిశ చూపగలిగిన నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కృతనిశ్చయంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే తాను చేరబోతున్నట్లు వెల్లడించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారని అన్నారు. జగన్ బయటకు రాగానే భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీలో చేరుతానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దీనికిముందు చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ములాఖత్‌లో కలుసుకున్నారు.