
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పర్యాటకం, పురావస్తు (ఆర్కియాలజీ), యువజన వ్యవహారాల శాఖలపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు. ‘భారత్‌లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి. సెవెన్ స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు అవసరం. ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుంది. పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించాలి’ అని సీఎం సూచించారు.
గండికోటలో గాజు వంతెన..!
రాష్టŠట్రంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై పూర్తిస్థాయి వివరాలతో సమాచారం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, నదికి అడ్డంగా గాజు వంతెన నిర్మించే యోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పర్యాటక ప్రాంతాలుగా జలాశయాలు...
పర్యాటకులను ఆకర్షించేందుకు పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతోపాటు అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు రక్షణశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పలు చోట్ల హోటళ్లు, రిసార్టులను నిర్వహిస్తున్నా నిధుల కొరతతో నిర్వహణ లోపాలు ఎదురవుతున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నిర్వహణ మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
హస్తకళలను ప్రోత్సహించాలి...
రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అరుదైన నైపుణ్యం కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి, కలంకారీ కళాకారులును ఆదుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీటిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు సాయం చేసేలా మార్గదర్శకాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఆర్కియాలజీ కార్పొరేషన్‌కు గ్రీన్ సిగ్నల్...
రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. శిల్పారామాలను అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనం పెంచాలన్నారు.
శిల్పారామాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు.
ఐదెకరాల్లో సాంస్కృతిక అకాడమీలు...
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కనీసం 5 ఎకరాల్లో ఈ అకాడమీల నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలని ఆకాంక్షించారు. మన కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇవి వేదికలు కావాలన్నారు. సంగీత, నృత్య కళాశాలలో బోధించే పార్ట్‌టైం, ఫుల్‌టైం సిబ్బంది జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారు.
జిల్లాకో క్రీడా సముదాయం...
‘ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాలు ఉండాలి. ప్రతి స్కూల్‌లో కూడా క్రీడల కోసం మైదానం అవసరం. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి? ఇంకా ఎన్నిచోట్ల ఏర్పాటు చేయాలి?’ అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వ్యాయామ శిక్షకులు తగినంత మంది ఉన్నారా? అనే విషయాన్ని కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడా స్టేడియంలు...
విశాఖపట్నం, రాజమండ్రి / కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి అండగా నిలవటంపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు.
భద్రతపై సంతృప్తి చెందితేనే బోట్లకు అనుమతి..
పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ఏర్పాట్లు చేశారని సంతృప్తి చెందిన తర్వాతే నదిలో బోట్లు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నదీ తీరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. వీటిపై ఏర్పాటైన కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని చెప్పారు. సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శిల్పారామాలను అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీనివాసరావు
మండల, నియోజకవర్గ స్థాయిలో స్టేడియంలు అభివృద్ధి చేయడంపై సమావేశంలో చర్చించినట్లు సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సాంస్కృతిక వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి కళాకారులకు అండగా ఉంటామన్నారు. ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శిల్పారామాలను కోటి రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
శిల్పారామాలు..
– ఇడుపులపాయలో కొత్తగా ఏర్పాటు..
– మిగతా ప్రాంతాల్లో శిల్పారామాల మరమ్మతులకు నిధులు
పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేవి
–కళింగపట్నం
–విశాఖపట్నం
–కాకినాడ
–రాజమండ్రి
–పోలవరం
–సూర్యలంక
–హార్సిలీ హిల్స్
–ఓర్వకల్లు
–గండికోట
–పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు జలశయాలను టూరిజం ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం
– అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లిలో టూరిజం పెంచేందుకు చర్యలు
గండికోట
– అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు
– నదికి అడ్డంగా గాజు వంతెన నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment