ఒంటివెలగల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్లు అంటూ నమ్మబలికి మోసం చేసిన దుర్మార్గపు ఆలోచనలు ఆయనవి అని విమర్శించారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒంటివెలగలలో జరిగిన రోడ్ షోలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ప్రభుత్వ నిరంకుశ పాలనను ఒంటివెలగల ప్రజల ముందు ఎండగట్టారు.
మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన ప్రధాన నాయకులెవరూ నంద్యాల వైపు తిరిగి చూడలేదని అన్నారు. అదే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఓట్ల కోసం నంద్యాల వీధుల్లో ఎక్కడ చూసిన టీడీపీ శ్రేణులు కనిపిస్తున్నాయని చెప్పారు. రాజకీయ నాయకులు ఎవరైనా మాటిచ్చి తప్పితే ప్రజలు వారిని కాలర్ పట్టుకుని అడుగుతారనే భయం కలగాలని అన్నారు.
'ఎర్రటి ఎండలో రోడ్డు మీదకు వచ్చి ఆత్మీయతను, ప్రేమానురాగాలను చూపుతున్నారు. అందరి ప్రేమ, ఆత్మీయతలకు చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలు జరగుతున్నాయన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకు జరగుతున్నాయన్న విషయం కూడా బాగా తెలిసే ఉంటుంది. నేడు నంద్యాలలో గత మూడున్నరేళ్లుగా ఎన్నడూ జరగనంతగా హడావుడి జరగుతూవుంది.
ఎన్నికల వస్తాయని తెలియక ముందు వరకూ చంద్రబాబు ఏ రోజైనా నంద్యాల వచ్చారా?. కనీసం ఆయన కేబినేట్‌లోని మంత్రులైనా పట్టణం వైపు తిరిగిచూశారా?. నేడు ఉప ఎన్నిక వచ్చేసరికి టీడీపీ నాయకులందరూ నంద్యాల రోడ్ల మీద కనపడుతున్నారు. చంద్రబాబు బెంబేలెత్తిపోయి హడావుడిగా జీవోల మీద జీవోలు జారీ చేస్తూ పోతున్నారు. చంద్రబాబు తన అవినీతి సంపాదన వందల కోట్ల రూపాయలతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి వస్తున్నారు.
నేను ఒకటే అడుగుతూ ఉన్నా ఇవన్నీ ఎందుకు జరగుతున్నాయని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ పోటీకి వచ్చింది కాబట్టి బాబు కనిపిస్తున్నారే తప్ప నంద్యాలపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. గెలుపు కోసం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన అతీగతిలేకుండా సాగుతోంది. మూడున్నరేళ్లలో ఒక్కమాటను కూడా చంద్రబాబు నేరవేర్చిన పాపానపోలేదు. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయని కారణంగా చంద్రబాబుకు ఈ దారుణ పరిస్ధితి వచ్చింది. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఈ పరిస్ధితి వచ్చింది.
ఎన్నికలప్పుడు చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు లెక్కుకు మించే ఉన్నాయి. మరి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా. వీధి వీధినా గోడలపై ప్రకటనలు ఇచ్చారు. అనువైన మీడియాతో ప్రచారం కల్పించుకుని ప్రజలను మోసం చేశారు. బాబు ముఖ్యమంత్రి కావాలంటూ ప్రకటనలు భారీగా ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.5 వేల కోట్లతో ధరల స్ధరీకరణ నిధి అన్నారు. మిర్చికి, శెనగకు నేడు ధరలు లేని పరిస్ధితి.
నేను బాబును అడుగతున్నా.. మీరు దీన్ని బాబు ఓట్ల కోసం ఇక్కడకు వచ్చినప్పుడు అడగండి. ఎన్నికలప్పుడు రైతులను ఉద్దేశించి మీరన్న మాటలు ఇవీ. ఒక్కటి కూడా నేరవేర్చిన దాఖలాలు లేవని ఆయన్ను ప్రశ్నించండి. బంగారు రుణాలు మాఫీ జరగలేదని, ఎందుకు చేయలేదని నిలదీయండి. ఒక్క హామీనైనా సరిగా నిలబెట్టుకున్నారా? అని ఆయన్ను కాలర్ పట్టుకుని అడగండి.
జాబు రావాలంటే బాబు రావాలని.. టీవీలు, గోడలపై ప్రకటనలు ఇచ్చారు. లేకపోతే నిరుద్యగ భృతి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి చంద్రబాబు నెలకు రూ.2 వేల చొప్పున మూడున్నరేళ్లకు రూ.76 వేలు బాకీ పడ్డారు. ఆ డబ్బు ఇచ్చారా? అని నేను అడుగుతున్నా. ఇదే చంద్రబాబు పొదుపు సంఘాలను, రైతులను, చదువుకున్న పిల్లలను కూడా మోసం చేశాడు.
పేద వాళ్లపై కూడా బాబు కన్ను పడింది. ఎన్నికలప్పుడు ఏమన్నారు. గుర్తుందా అవ్వా.. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తానని బాబు అన్నారు. మూడున్నరేళ్లయింది ఒక్క ఇళ్లైన కట్టించారా?. ఎన్నికలైన తర్వాత ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. ముఖ్యమంత్రి హోదాలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చంద్రబాబు కర్నూలుకు వచ్చారు. మైకు పట్టుకుని ఇది చేస్తా, అది చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి స్ధాయిలోని ఓ వ్యక్తి ఏదైనా చెప్తే అది జరుగుతుందని అందరం అనుకుంటాం. కానీ జరిగాయా?.
ఆయన కర్నూలుకు వచ్చి ఎయిర్‌పోర్టు, ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో స్మార్ట్ సిటీ, మైనింగ్ స్కూలు, ఫుడ్ పార్కు, సిమెంట్ ఫ్యాక్టరీలు, పారిశ్రామిక పార్కులు నిర్మిస్తామని వాగ్ధానాలు చేశారు. మూడేళ్లు దాటింది. ఏ ఒక్కటైనా బాబు పూర్తి చేశారా? అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్లు అడగడానికి మళ్లీ వస్తాడు. వచ్చి ఓట్లు అడుగుతాడు. అభివృద్ధి చేస్తా అని అబద్దాలు చెప్తాడు. రాజకీయ నాయకులు ఒకమాటిచ్చి తప్పితే ప్రజలు కాలర్ పట్టుకుని అడుగుతారనే భయం కలగాలి. నంద్యాలలో వేసే ఒక ఓటు వల్ల నేను ముఖ్యమంత్రిని కాలేకపోవచ్చు కానీ వచ్చే ఒక సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఈ ఎన్నిక నాంది పలకాలి.
నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి. అభివృద్ధి అంటే నేను చూపిస్తా. అభివృధ్ధంటే రైతు ముఖంలో సంతోషం కనిపించాలి. ఇవాళ చంద్రబాబు మాదిరిగా నా దగ్గర పదవి లేదు, డబ్బు లేదు, పోలీసులు లేరు, ఆయన చెప్పమన్నట్లు, రాయమన్నట్లు రాసే టీవీ చానెళ్ల, పేపర్లు లేవు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజల ముందుకు వచ్చే బుద్ధి నా దగ్గర లేదు. నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ప్రజలు. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా?. నాన్న గారు చేసిన మంచి. ఇవాళ్టికి కూడా ఆయన చేసిన మంచిని ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. నాకున్న ఆస్తి జగన్ అబద్దం ఆడడు, మోసం చేయడు, మాట ఇస్తే వెనకడుగు వేయడు అనే నమ్మకం. చంద్రబాబు దగ్గరున్నవి ఏవీ నా దగ్గరలేవు. ఉన్నవి కేవలం దేవుడి దయ, మీ అందరీ ఆశీస్సులు.
రాబోయే రోజుల్లో మూటమూటలు డబ్బుతో బాబు ఇక్కడకు వస్తారు. ఓటుకు రూ.5 వేలు కుమ్మరిస్తారు. ఓటు తమకే వేయాలని మీ అందరితో ప్రమాణం చేయించుకుంటాడు. మీ అందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా.. వారు వచ్చినప్పుడు మీరు లౌక్యంగా ప్రవర్తించాలి. న్యాయమే గెలవాలని మనసులో ప్రార్థించాలి. న్యాయానికే ఓటు వేయండి. అధర్మానికి, ధర్మానికి మధ్య జరగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలవండి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాలలో పోటీ చేస్తున్న శిల్పామోహన రెడ్డికి ఓటు వేయాలని పేరుపేరునా కోరుతున్నా.'