సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2018 జూలై 11న అనపర్తి నియోజకవర్గం పందలపాకలో ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతూండగా తన బిడ్డతో కలిసి వచ్చిన ఓ చెల్లెమ్మను చూసి ‘నీ కష్టం ఏంట మ్మా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగారు. ఆ సం దర్భంగా మద్యం రక్కసి కారణంగా తన కుటుంబం పడుతున్న కష్టాలను చెప్పుకున్న ఆమె ‘మద్యాన్ని నిషేధించండన్నా’ అని అభ్యర్థించారు.
‘మీరు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాల’ని బిక్కవోలుకు చెందిన ఇందన వీరకాసులు అనే మహిళ 2018 జూలై 12న తన గ్రామం మీదుగా వెళ్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరింది. తన ముగ్గురు కుమారులూ మద్యానికి పూర్తిగా బానిసలయ్యారని, ఒక కుమారుడు చనిపోగా, మిగిలిన ఇద్దరూ కూడా రోజూ తాగి తనను కొట్టి, ఇంట్లోంచి తరిమివేశారని వాపోయింది. తన కుటుంబం మాదిరిగా రాష్ట్రంలో అనేక కుటుంబాలు మద్యం కారణంగాచిన్నాభిన్నమవుతున్నాయని వాపోయింది. ఇలా దారి పొడవునా మహిళలు మద్యం మహమ్మారితో పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. 2018 జూలై 25న పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో వేలాది మంది మహిళల కరతాళ ధ్వనుల మధ్య మద్యనిషేధంపై ప్రకటన చేశారు. ‘దేవుడు కరుణించి, మనందరి ప్రభుత్వం వస్తే 2024 నాటికి రాష్ట్రంలో మద్యం దుకాణాలు లేకుండా చేస్తాన’ని హామీ ఇచ్చారు.
‘బెల్ట్’ తీయడంతో ఆరంభం
అందరూ అనుకున్నట్టుగానే ప్రజల అశేష ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన దిశగా అడుగులు వేయడం ఆరంభించారు. ఇందులో భాగంగానే ఇచ్చిన హామీకి అనుగుణంగా దశల వారీగా మద్యనిషేధం అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో తొలుత బెల్ట్‌షాపులు పూర్తిగా ఎత్తివేయాలని, అధికారిక షాపులు తప్ప బెల్ట్‌షాపులనేవి కనిపించకూడదని సీఎం ఆదేశించారు. జిల్లాలో ఆరేడు వేల వరకూ బెల్ట్‌షాపులు ఉన్నాయి. అధికారికంగా చెప్పకపోయినా దాదాపు ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాపులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు తొలి అడుగుగా బెల్ట్‌షాపులన్నీ కనుమరుగు కానున్నాయి. ఇకపై మద్యం అధికారిక షాపులకే పరిమితం కానుంది. జిల్లాలో 540 మద్యం దుకాణాలు, 40 వరకూ బార్లు ఉన్నాయి. వాటిలోనే మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది.
మూడో సంతకానికి చంద్రబాబు తిలోదకాలు
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారం రోజున బెల్ట్‌షాపులను ఎత్తివేస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడో సంతకం పెట్టారు. కానీ ఆచరణలో ఆ హామీకి తిలోదకాలిచ్చారు. పైగా వీధి చివరన, గుడి, బడి పక్కన మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్ట్‌షాపులను విచ్చలవిడిగా ప్రోత్సహించారు. మద్యాన్ని ఏరుల్లా పారిస్తూ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించారు. పేదల ఇళ్లను గుల్ల చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడారు. అమ్మకాలే లక్ష్యంగా 2015లో లిఫ్టింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. మునుపటి ఏడాది, నెల ప్రామాణికంగా 10 శాతం అదనపు కొనుగోళ్లు చేయాలని వ్యాపారులపై ఒత్తిడి తెచ్చారు. బెల్ట్‌షాపులు, మద్యం ధరలను పెంచుకునేందుకు పరోక్షంగా అనుమతి ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014 నుంచి ఒకేసారి మద్యం దుకాణాలు రెట్టింపు కాగా.. విక్రయాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. చంద్రబాబు సర్కార్ వచ్చే నాటికి రోజువారీ అమ్మకాలు రూ.కోటి వరకూ ఉండగా ఆ తరువాత రోజుకు రూ.5.60 కోట్ల వరకూ పెరిగాయి.
కూలిన కుటుంబాలెన్నో..
- మద్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు, లైంగిక దాడులు జరుగుతున్నా యి. అనేక కుటుంబాల్లో అశాంతి జ్వాలలు రేగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మరణాలు సంభవించాయి.
- కాకినాడ ఏటిమొగ రోడ్డులోని మద్యం షాపు వద్ద తలెత్తిన వివాదంలో ఒక వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- చింతూరు మండలం తుమ్మలలో తనతో సహజీవనం చేస్తున్న మహిళను సీతయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో హతమార్చాడు.
- అమలాపురం నల్లవంతెన సమీపంలోని మద్యం షాపు వద్ద ఓ జట్టు కూలీ మద్యం మత్తులో మరో జట్టు కూలీని తలపై రాయితో మోది హతమార్చాడు.
- రాజమహేంద్రవరం అంబేడ్కర్ నగర్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని మృతి చెందాడు.
- భర్త మద్యం వ్యసనానికి బానిసై, కుటుంబ పోషణను పట్టించుకోవడం లేదన్న విరక్తితో రాజమహేంద్రవరంలో ఒక మహిళ, తన పిల్లలను తీసుకుని గోదావరిలో దూకేసింది. అక్కడి మత్స్యకారులు వారిని రక్షించారు.
- సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో మద్యం మత్తులో గ్రావెల్ లోడు లారీ ఓ ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
- ఇవేవీ చంద్రబాబును కనీసంగా కూడా కదిలించలేదు. కుటుంబాలు కూలిపోతున్నా, పిల్లలు అనాథలవుతున్నా, ఆర్థికంగా చితికిపోతున్నా పట్టలేదు. ప్రమాణ స్వీకారం రోజున బెల్ట్‌షాపులను నియంత్రిస్తానంటూ పెట్టిన మూడో సంతకాన్ని కూడా అమలు చేయలేదు. దీంతో పేదల పరిస్థితి పరమ దయనీయంగా తయారైంది. సంపన్నుల కుటుంబాల్లో సహితం మద్యం రక్కసి చిచ్చు రేపింది. ఆ మత్తులో పడి అనారోగ్యానికి గురై, అనేకమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment