బీసీల సిక్కోలుకు.. జగన్‌ వరాల మూట! | YS Jagan Promis To Sikkol BCs in East Godavari Meeting | Sakshi
Sakshi News home page

బీసీల సిక్కోలుకు.. జగన్‌ వరాల మూట!

Published Mon, Feb 18 2019 9:24 AM | Last Updated on Mon, Feb 18 2019 9:24 AM

YS Jagan Promis To Sikkol BCs in East Godavari Meeting - Sakshi

బీసీ డిక్లరేషన్‌... ప్రకటించడంలోనే కాదు అధికారంలోకి వస్తే ఏవిధంగా సాకారం చేస్తామో విస్పష్టంగా చెప్పారు రాష్ట్ర విపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఏలూరు వేదికగా ఆదివారం జరిగిన ‘బీసీ గర్జన’ ఇందుకు వేదికైంది. ఆర్థికంగా, సామాజికంగానే గాకుండా విద్యా ఉద్యోగాల్లోనూ వెనుకబడిన బీసీలకు ఆయన ఇచ్చిన వరాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల్లో నూతన ఉత్సాహం నింపాయి. అన్ని విధాలా అభివృద్ధి సాధించడానికి, తమ కులం ఉనికిని కాపాడుకోవడానికి ఏవిధమైన చర్యలు ఉండాలో బీసీలు కోరుకున్నట్లే జగన్‌ వరాల మూట అందించారు. ఇవి అమలైతే బీసీ జనాభా అత్యధికంగా ఉన్న సిక్కోలుకే పెద్దపీట దక్కుతుంది!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా సిక్కోలు జిల్లా మాత్రం అభివృద్ధిలో అట్టడుగునే ఉండిపోయింది. ఉపాధి, ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకే కాదు ఇతర రాష్ట్రాలకే వలస పోవడమనేది సర్వసాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి 2004 సంవత్సరంలో డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత చురుగ్గా చర్యలు చేపట్టారు. 2009లో ఆయన అకాల మరణం చెందేవరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలు మిగతా రాష్టాలకూ స్ఫూర్తిగా నిలిచాయి. తద్వారా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు బీసీల జపమే తప్ప పురోగతికి తీసుకున్న చర్యలు నానాటికీ తీసికట్టుగా మారాయి! కులాల మధ్య అసమానతలు పెరిగాయి. దీంతో పలు బీసీ కుల సంఘాలు తమ హక్కుల కోసం గొంతెత్తాయి.

మత్స్యకారులు, రజకులు, కల్లుగీత కార్మికులు, యాదవులు, నాయీ బ్రాహ్మణులు... ఇలా పలు సంఘాల వారు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు తీర్చాలంటూ మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునే వేడుకున్నారు. కానీ మత్స్యకారులనేమో ‘ఎక్కువ చేస్తే తాటతీస్తా!’ అని, నాయీ బ్రాహ్మణులనేమో ‘తమాషాలు చేస్తున్నారా? తోక కత్తిరిస్తా’ అని బెదిరించిన ఘటనలూ ఉన్నాయి! ఇలాంటి నేపథ్యంలో జిల్లాలోగత ఏడాది నవంబర్‌ 25వ తేదీన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుపెట్టారు. జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో యాత్ర ముగిసినంత వరకూ పలువురు బీసీలను ఆయన కలిశారు. వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. అలాగే వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా వినతిపత్రాలు అందించారు. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీల ఉద్ధరణకు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టనున్నదీ స్పష్టం చేస్తూ ఆదివారం ‘బీసీ డిక్లరేషన్‌’ను ప్రకటించారు.

సిక్కోలుకే అగ్రభాగం...
జిల్లాలోని మొత్తం జనాభాలో బీసీలు 80 శాతం పైమాటే! మెజార్టీ సామాజిక వర్గాలైన తూర్పుకాపు, పోలినాటి వెలమ, కొప్పుల వెలమ, కాళింగ, యాదవ, మత్స్యకారులు, రెడ్డిక, కళింగ వైశ్యులు, శిష్ట కరణాలే గాకుండా కమ్మరి, కుమ్మరి, రజక, నాయీబ్రాహ్మణ, పద్మశాలీ, శ్రీశైయన... ఇలా దాదాపు 73 కులాల వారు బీసీలుగానే ఉన్నారు. జిల్లాలో బీసీల జనాభా సుమారు 20 లక్షల మంది ఉన్నారు. జగన్‌ ప్రకటించిన ‘బీసీ డిక్లరేషన్‌’ అమలు ద్వారా ఎక్కువగా మేలు జరిగేది జిల్లా వాసులకేన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా వరాలతో బీసీల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పలువురు నాయకులు హర్షం ప్రకటిస్తున్నారు.

బీసీలకు సంబంధించిన అభివృద్ధి పథకాలకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా రూ.15,000 కోట్లు ఇవ్వనున్నారు. దీంతో బీసీలు ఎక్కువగా ఉన్న సిక్కోలు జిల్లాకు కనీసం రూ.150 కోట్లు వరకూ ప్రయోజనం చేకూరుతుంది.
జిల్లాలో ఇప్పటివరకూ బీసీల్లో ఏ కులానికీ ప్రత్యేకంగా కార్పొరేషన్‌ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా జిల్లాలోనున్న 73 బీసీ కులాలకు ఈ కార్పొరేషన్లు అందుబాటులోకి వస్తాయి. వాటితో సంక్షేమ రుణాలు ప్రతి కులానికీ చేరుతాయి.
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఈ పథకంతో జిల్లాలో సుమారు 3 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది.
ఇప్పటికే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా లక్షల మంది బీసీ విద్యార్థులు లబ్ధి పొందారు. తండ్రి ఒరవడిని కొనసాగిస్తూ జగన్‌ కూడా భరోసా ఇచ్చారు. విద్యాభ్యాసానికయ్యే మొత్తం ఖర్చును భరించడమే గాక అదనంగా ఏడాదికి రూ.20 వేలు హాస్టల్‌ ఖర్చు నిమిత్తం ప్రతి బీసీ విద్యార్థికీ అందించనున్నారు. తద్వారా జిల్లాలో 1.20 లక్షల మంది బీసీ విద్యార్థులకు భరోసా లభించనుంది.
ప్రతి కుటుంబం నుంచి పిల్లలను బడికి పంపిస్తే ఆ కుటుంబంలో తల్లి పేరిట రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని జగన్‌ ప్రకటించారు. తమ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల తమ పిల్లలను బడికి పంపలేనివారు ఎక్కువ మంది బీసీలే. ఇలాంటి సుమారు 3.50 లక్షల బీసీ కుటుంబాలకు చేయూత అందుతుంది.
జిల్లాలో ఎరుకల, సగర, పూసల తదితర సంచార జాతుల వారు దాదాపు 5 వేల కుటుంబాల వరకూ ఉన్నారు. వారికి స్థిర నివాసం కల్పించడంతో పాటు పిల్లలకు ప్రత్యేక గురుకులం ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.
మత్స్యకార కుటుంబాలు జిల్లాలో 1.10 లక్షల వరకూ ఉన్నాయి. సముద్ర తీరం వెంబడి ఉన్న 11 మండలాల్లోని 110 గ్రామాల్లో మత్స్యకార జనాభా అత్యధికంగా ఉంది. సముద్రంలో వేట నిషేధ సమయంలో ప్రస్తుతం రూ.4 వేలు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. దీన్ని రూ.10 వేలకు పెంచుతామని జగన్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు బోటు కొనుగోలుకు, బోటుకయ్యే డీజిల్‌కు భారీగా రాయితీ ఇస్తామన్నారు.
చేనేత కుటుంబాలు జిల్లాలో పది వేల వరకూ ఉన్నాయి. వారిలో వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నవారికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది.
యాదవుల జనాభా జిల్లాలో రెండు లక్షల వరకూ ఉన్నారు. వారి సన్నిధికి వారసత్వ హక్కులు కల్పిస్తామని, అలాగే గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేల చొప్పున బీమా పరిహారం అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.
నామినేటెడ్‌ పదవులు జిల్లాకు అరకొర మాత్రమే దక్కుతున్నాయి. అలాగాకుండా నామినేటెడ్‌ పదవుల్లో సగం కోటా బీసీలకు వస్తుంది.  

జీవితాలే మారిపోతాయి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు బీసీ గర్జన సభలో  ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రంలో  బీసీ వర్గాల జీవితాలే మారిపోతాయి. 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు గల వారికి రూ.75 వేలు ఉచితంగా అందిస్తామనడంలో బీసీల్లో ఉత్కంఠ నెలకుంటోంది. బీసీ విద్యార్థుల చదువులకు  రూ. 20 వేలు ఉచితంగా ఇస్తాననడం విద్యార్థులకు ఆసరాగా ఉంటుంది. చిరు వ్యాపారులకు ఇచ్చే రూ. 10 వేలు వడ్డీ లేకుండా ఎంతో తోడ్పడుతుంది.– తమ్మినేని సీతారాం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు

సంపూర్ణ న్యాయం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది. అన్ని వర్గాలకు వరాల జల్లు కురిపించడం  అభినందనీయం. రాష్ట్ర బడ్జెట్‌లో మూడోవంతు బీసీలకు ఖర్చు చేస్తామని ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.–పిరియా సాయిరాజ్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఇచ్ఛాపురం

 అన్నివర్గాలను ఆదుకునే కార్యచరణ
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌నుభారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు లేని విధి విధానాలు రూపకల్పన చేయడం ఆనందదాయకం. అన్ని రకాల చేతివృత్తుల వారికి న్యాయం జరిగేలా ఉంది. 31 కార్పొరేషన్లకు తెరతీయడం చరిత్ర సృష్టించడమే.  మత్స్యకారులకు రూ.10 వేలు వేట నిషేధం ప్రకటన, మరణించిన వారికి రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా, సబ్సిడి డీజిల్, బోట్లు ఇలా అందరికి న్యాయం చేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నాం.– డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, పలాస

 బీసీలకు మేలు..
 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు అన్ని విధాలా మేలు చేకూరే విధంగా  చర్యలు చేపడతామని  జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్హణీయం. మడమ తిప్పని నాయకుడుగా వెలుగొందుతున్న జగన్‌ ఏలూరు సభలో ప్రకటించిన విధంగా అన్ని వర్గాల బీసీలకు ఆదుకుంటారు. ప్రతి కులానికి కార్పొరేషన్‌ పెట్టి వారి అభివృద్ధికి దోహదపడతారు. ఇందులో సందేహం లేదు. అన్ని వర్గాల బీసీలకు మేలు చేకూరే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి.  –  ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త,  నరసన్నపేట

చరిత్రలో నిలిచిపోయే రోజు
టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది. ఎన్నికల ముందు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి హడావుడి సృష్టిస్తోంది. బీసీ కార్పొరేషన్‌ రుణాలు సైతం జన్మభూమి కమిటీల జోక్యంతో అందజేశారు. రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ చరిత్రలో నిలిచిపోయే రోజు. రూ. 15,000 కోట్లు కేటాయింపు, సబ్‌ ప్లాన్‌ అమలు, చదువులకు కేటాయింపులు, బడ్జెట్‌  కేటాయింపులు, చిరు వ్యాపారులు, కుల వృత్తులకు ప్రోత్సాహం వంటివి బీసీ కులాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. బీసీలకు సంపూర్ణ న్యాయం జరగుతుంది.– గొర్లె కిరణ్‌కుమార్,  వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఎచ్చెర్ల  

బీసీ వర్గాలకు జగనన్న ఎంతో ప్రాధాన్యత కల్పించారు
 బీసీ గర్జనలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గాలకు ఎం తో ప్రాధాన్యత కల్పించారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కల్పిం చని విధంగా వరాల జల్లు కురిపించారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఏడాదికి 15 వేల కోట్లు కేటాయించడం.. తొలి అసెంబ్లీలో సబ్‌ప్లాన్‌ చట్టం చేస్తామని చెప్పడం బీసీ వర్గాలకు సంతోషాన్నిచ్చింది. బీసీ జాబితాలో ఉన్న ప్రతి వర్గానికి మేలు జరిగేలా జగనన్న ప్రణాళిక రూపొం దించారు. – పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త,టెక్కలి నియోజకవర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement