
నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటూ..
నేనున్నానంటూ అండగా నిలిచినందుకు.. మేమున్నామంటూ అంతేస్థాయిలో కృతజ్ఞత చూపించారు వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు. మెరుగైన పరిహారం, ప్యాకేజీ కోసం పోరాటం చేపట్టి అప్పటి టీడీపీ సర్కారు మెడలు వంచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాతపట్నం ప్రజానీకం ఓట్ల రూపంలో తమ అభిమానాన్ని తెలియజేశారు. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టి కృతజ్ఞతను చాటిచెప్పారు.
శ్రీకాకుళం, హిరమండలం: వంశధార ఫేజ్–2 రిజర్వాయర్.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెరపైకి వచ్చిన బహుళార్థక సాధక ప్రాజెక్ట్. వంశధార మిగులు జలాలను ఒడిసి పట్టి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. 2005లో రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఒడిశాతో వివాదాలు చుట్టుముట్టినా కార్యదీక్షతో రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నారు. అదే సమయంలో రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా సర్వం పోగొట్టుకున్న 18 గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయాలని..వారి త్యాగాలకు విలువ కట్టలేమని..వీలైనంత వరకూ వారికి అన్నివిధాలా చేయూతనివ్వాలని పరితపించే వారు. మెరుగైన ప్యాకేజీ, పరిహారంతో పాటు వారి జీవనోపాధికి భంగం కలుగకుండా చూడాలని ప్రయత్నించారు. ఇంతలోపే 2009లో ఆయన హఠాన్మరణం చెందారు. అక్కడి నుంచి నిర్వాసితుల కష్టాలు తీర్చేవారే కరువయ్యారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తిచేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పాతపట్నం నుంచి బరిలో దిగిన కలమట వెంకటరమణమూర్తిని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని వెంకటరమణమూర్తి వమ్ము చేస్తూ వ్యక్తిగత స్వార్థంతో టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదు.
నిర్వాసితుల గొంతుకైన జగనన్న..
నిర్వాసితుల దయనీయ పరిస్థితిని అటు ప్రభుత్వం వినలేదు కదా..పోలీస్ కేసులతో ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించింది. ఈ పరిస్థితుల్లో నిర్వాసితుల గొంతుకయ్యారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు 2017 మే 19న హిరమండలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. అసలు నిర్వాసితుల సమస్యలేమిటి? వారు అడుగుతున్న కోర్కెలు ఏమిటి? పరిహారం ఎంతకావాలి? అన్న విషయాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నిర్వాసితుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. నిర్వాసితులపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు సర్కార్ మెడలు వంచి న్యాయం చేస్తానని ప్రకటించారు. 2013 భూ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల త్యాగాలకు ఎందుకు విలువ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల్లో మెరుగైన ప్యాకేజీలు అందుతున్నా ఇక్కడే ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులకు బాధలు లేకుండా చేస్తానని అప్పట్లో ప్రకటించారు. దీంతో జగనన్న తమకు అండగా నిలిచారన్న నమ్మకం నిర్వాసితుల్లో వ్యక్తమైంది. అటు తరువాత ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు పరిహారం, ప్యాకేజీల కోసం విడుదల చేసినట్టు ప్రకటించినా నిజమైన నిర్వాసితులకు సాంత్వన చేకూర్చలేదు. ప్యాకేజీ పంపిణీలో భారీ అవినీతి చోటుచేసుకుంది.
యూత్ ప్యాకేజీ విషయంలో బినామీలదే రాజ్యమైంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి నుంచి కింది స్థాయి వరకూ అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ నిర్వాసితుల్లో గూడుకట్టుకున్నాయి. అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని పెల్లుబికేలా చేశాయి. 2018 జనవరిలో సంక్రాంతి సమయంలో పోలీసులతో గ్రామాలను ఖాళీ చేయించారు. పండగ తర్వాత వెళ్తామని బతిమలాడిన పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు వచ్చారు. నియోజకవర్గంలోని మెళియాపుట్టి సభలో నిర్వాసితుల సమస్యలను ఏకరవు పెట్టారు. వారి దయనీయ పరిస్థితిని..ప్రభుత్వం చూపిన దమననీతిని ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించడంతో పాటు పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. వారి త్యాగాలు గుర్తించుకొని వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. వీటిన్నింటిని గుర్తించిన నిర్వాసితులు వైఎస్సార్‌సీపీకి తాజా ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని అందించారు. పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో తమకు అన్నివిధాలా భరోసా ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కానుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు అన్నివిధాలా చేయూతనివ్వాని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్వాసితులకు అండగా వైఎస్సార్‌సీపీ
వంశధార నిర్వాసితులకు మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఎన్నోరకాల ఇబ్బందులకు గురిచేసింది. అయినా ప్రతిఘటిస్తూ వచ్చాం. చివరకు గ్రామాలను సైతం బలవంతంగా ఖాళీ చేయించారు. జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించిన తర్వాత టీడీపీ సర్కార్ పరిహారం, ప్యాకేజీ మంజూరు చేసింది. అందులో కూడా అవినీతికి పాల్పడింది. అందుకే నిర్వాసితులు వైఎస్సార్‌సీపీని గెలిపించారు. –గొర్లె మోహనరావు, నిర్వాసితుడు, పాడలి
ఆదుకుంటారనే నమ్మకముంది
టీడీపీకి నిర్వాసితుల ఉసురు తగిలింది. అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ కొట్టుకుపోయింది. నిర్వాసితుల సమస్యలు గాలికొదిలేసి వారిపై కక్షపూరితంగా వ్యవహరించింది. పోలీసులతో ఉక్కుపాదం మోపింది. ఈ పరిస్థితిలో జగనన్న అండగా నిలిచారు. ఆ కృతజ్ఞతతోనే ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడ్డారు. నిర్వాసితుల సమసయలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీర్చుతుందన్న నమ్మకం ఉంది. –గొల్లంగి మోహన్‌రావునిర్వాసితుడు, సుభలయ
Comments
Please login to add a commentAdd a comment