హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం అయిదు గంటలకు ఆయన ఉండ్రాజవరం చేరుకుంటారు. ఇటీవల మరణించిన వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబసభ్యుల్ని పరామర్శిస్తారు.
ఉండ్రాజవరానికి చెందిన చిన్నారావు గుండెపోటులో మరణించిన విషయం తెలిసిందే. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితులు. చిన్నారావు మృతి చెందిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఇవాళ చిన్నారావు కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన బుట్టాయగూడెం చేరుకుంటారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఇంట్లో వైఎస్ జగన్ రాత్రికి బస చేస్తారు.
బుధవారం ఉదయం జంగారెడ్డిగూడెం చేరుకుని పొగాకు బోర్డును సందర్శిస్తారు. అక్కడ పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. రెండేళ్లుగా పొగాకు రైతులు నష్టాల్లో కూరుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు కుక్కునూరు చేరుకుని, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శిస్తారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.