
19, 20 తేదీల్లో జిల్లాలో జగన్ పర్యటన
హిరమండలం: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. హిరమండలంలో ఈనెల 19న ఆయన పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు.
స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార నిర్వాసితులను ఆదుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్వాసితులను క్షోభ పెడుతోందని తెలిపారు.
అందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితుల కన్నీళ్లు తుడవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కోసం స్థల పరిశీలన కూడా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అల్లు కృష్ణారావు, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు శంకర్‌రావు, త్రినాథరావు, ప్రసాద్, షన్ముఖరావు, నాయకులు మురళి, కన్నయ్య, సత్యన్నారాయణ, రవివర్మ, నరేష్, కొల్ల కృష్ణ పాల్గొన్నారు.
కన్నీళ్లు తుడవడానికే..
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప ర్యటన ద్వారా వంశధార నిర్వాసితులను, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ రోగులను కలసి వారి సమస్యలను తెలుసుకుంటారని రెడ్డి శాంతి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ హ యాంలో వంశధార ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారని, కానీ ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆమె ఆరోపించారు.
టీడీపీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణంపై కనీస శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో కనీస నిధులు కూడా కేటాయించలేదన్నారు. ప్రాజెక్టు పరిధిలో 29 గ్రామాలు ఉండగా వారెవ్వరికీ ఎలాంటి ప్యాకేజీ ఇ వ్వలేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట తన స్వలాభం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలోకి చేరారని మండిపడ్డారు.
వంశధార ప్రాజెక్టు నిర్మాణం వల్ల పునరావాసం లేకుండా, నష్టపరిహారం అందకుండా 8 వేల కుటుం బాలు రోడ్డున పడ్డాయని చెప్పారు. రణస్థలం మండలం కొవ్వాడ ప్రాంతంలో నిర్మించనున్న అణుప్రాజెక్టు కోసం ఆ ప్రాంతంలో భూసేకరణ చేపడితే అక్కడి వారికి ఎకరాకు రూ. 11లక్షల నుంచి 14లక్షల వరకూ ప్రభుత్వం చెల్లిస్తోం దని, వంశధార ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత రైతులకు మాత్రం కంటితుడుపు చర్యగా నగదు చెల్లించడం శోచనీయమన్నారు. వైఎస్ జగన్‌మోహనరెడ్డి వంశధార నిర్వాసితులకు అండగా నిలబడతారని తెలిపారు.
అలాగే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కిడ్నీ వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని కూడా వేశారని, ఆయన మరణం తర్వాత అది మరుగున పడిందన్నారు. టీడీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నామమాత్రంగా చర్యలు చేపడుతోందని, జగన్‌మోహనరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.