‘పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే.. నేను రెండడుగులు ముందుకు వేస్తాను.. అన్ని నిరుపేద వర్గాలకు అండగా ఉంటాను’.. ప్రజలకు భరోసా కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలికిన పలుకులివి. సాధారణ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా తాను ఎలా ముందుకు నడవాలి? రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసేలా ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అనే అంశాల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను జగన్ ఇప్పటికే రూపొందించుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే మాట తప్పని, మడమ తిప్పని విధంగా పోరాటం సాగించిన ఆయన ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేయనున్నారు.
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన చివరి రక్తపు బొట్టు వరకు సేవలందించిన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికలకు ముందు వరకు జవజీవాలు లేకుండా చేవచచ్చి పడి ఉన్న పార్టీని తన భుజస్కందాలపై వేసుకొని మోశారు.. దానికి కొత్త ఊపిరిలూదారు. ఒక పక్క వర్షాలు లేక కరువుతో రాష్ట్రం దుర్భిక్షం కోరల్లో చిక్కుకొని ప్రజలు విలవిల్లాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. రైతులపై కాల్పులు జరిపించి పలువురి ప్రాణాలు బలి తీసుకుంది. తమకు న్యాయం చేయాలని కోరడానికి వచ్చిన అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించి వాటర్ క్యాన్లతో వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారికి ఓదార్పునిస్తూ.. అండగా నిలిచేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే శ్రీకారం చుట్టారు. చెప్పినవాటిని కాకుండే చెప్పనివాటిని నెరవేర్చారు. హామీలు ఇవ్వకపోయినా పేద ప్రజల మేలు కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. 2009 ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం పొత్తుల కోసం వెంపర్లాడినా కాదని ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి మహానేతగా ఆవిర్భవించారు. అదే ఏడాది ఆయన ఆకస్మిక మరణానంతరం పరిస్థితులు అధ్వానంగా మారాయి. పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు మెల్లగా నీరుగారిపోయాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని తుంగలో తొక్కి సొంత లాభం, స్వార్థమే పరమావధిగా పాలన సాగించారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి అప్రజాస్వామిక, నిరంకుశ పాలనతో ప్రజలను అన్ని రకాలుగా హింసించారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అడ్డంకులు.. ఆటంకాలను దాటుకుని..
తన తండ్రిలానే ఇచ్చిన మాట, ప్రజా క్షేమం కోసం ఎంత దూరమైనా వెనుదీయక పోరాటం సాగించిన వైఎస్ జగన్ తన లక్ష్యసాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక ముందడుగు వేశారు. తన తండ్రి దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుమతి నిరాకరించింది. అయినా సరే నల్లకాలువ సభలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించడానికే నిర్ణయించుకున్న జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు పూర్తిగా తన తండ్రి ఆశయాలతో ముందుకు కదులుతూ పేదలకు అండగా నిలబడ్డారు. నాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రజా సమస్యలను విస్మరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌ని అణచివేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అన్ని మాయోపాయాలను పన్నింది. తాను గెలవలేనని తేటతెల్లం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు తెరతీశారు. కాంగ్రెస్ నాయకత్వంతో కలసి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి సీబీఐ విచారణ అంటూ 16 నెలల పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అక్రమంగా జైలులో పెట్టించారు. ఇలా ఎన్నో వే«ధింపులు.. మరెన్నో అవమానాలు ఎదురైనా వెరవక వాటన్నిటినీ ఎదుర్కొంటూనే ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ పోరాటం సాగించారు. తన తండ్రి పోరాటపటిమే స్ఫూర్తిగా ముందుకు సాగారు.
మోసపూరిత, అబద్ధపు హామీలకు దూరంగా..
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్ కూడా విలువలకు ప్రాణమిచ్చే వ్యక్తి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి పెద్ద పీట వేసే నైజం. కష్టాల్లో ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తన వెంట నడవడానికి సిద్ధపడి ముందుకువచ్చినా వారిని ఆ పార్టీ పదవులకు రాజీనామా చేశాకే తన పార్టీలోకి ఆహ్వానించారు. అలాంటి వారిని మళ్లీ ప్రజల ముందుకు తీసుకెళ్లి ఉపఎన్నికల్లో గెలిపించుకున్నారు. 2012లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ సభ్యులను గెలిపించుకోవడమే కాకుండా ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కనీయలేదు. 2014 ఎన్నికల సమయంలోనూ తాను చేయగలిగే వాటినే చెబుతానని, అబద్ధపు హామీలు ఇవ్వనని చెప్పి ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2014లోనూ మోసపూరిత హామీలిస్తే గెలిచే అవకాశాలున్నా వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి విలువలకే పెద్దపీట వేశారు.
చంద్రబాబు నిరంకుశ చర్యలకు ఎదురొడ్డి..
2014 ఎన్నికల్లో కేవలం 1.67 శాతం ఓట్ల తేడాతో వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారు. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేయని అరాచకం లేదు. తన తండ్రి మాదిరిగానే జగన్ కూడా వాటిపై రాజీ లేని పోరాటం సాగించారు. చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వాటిని తన తన అనుచరగణానికి, భారీగా కమీషన్లు ఇచ్చే వారికి కట్టబెట్టారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడిపోయినా పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారు. రైతు రుణ మాఫీని, డ్వాక్రా రుణాల మాఫీని పక్కన పెట్టారు. భృతిని ఎన్నికల ముందు పంచారు. వీటన్నిటిపై వివిధ దీక్షలు, ఆందోళనలు, సభలు, ధర్నాల ద్వారా జగన్ అలుపెరగని పోరాటం సాగించారు. ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ప్రజాసంక్షేమమేధ్యేయంగా నవరత్నాలు
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా చేపట్టేలా నవరత్నాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడమే కాకుండా వేయి దాటితే దానికి ఆరోగ్యశ్రీ వర్తించేలా నవరత్నాల్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ అమలయ్యేలా విధంగా చర్యలు తీసుకోనున్నారు. వైఎస్సార్ హయాంలో ఫీజురీయింబర్స్‌మెంట్ కింద పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించగా చంద్రబాబు దాన్ని రూ.35 వేలకు కుదించారు. ఇప్పుడు జగన్ వైఎస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించేలా చేయడంతోపాటు విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు అందించనున్నారు. అదేవిధంగా పిల్లలను బడికి పంపి ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు ఇవ్వడానికి నిర్ణయించారు. సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తారు. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఐదేళ్లలో మొత్తం 25 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికి నేరుగా ఇస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. జలయజ్ఞం కింద పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జగన్ సంకల్పించారు. రైతులకు భరోసా ఇచ్చేలా వ్యవసాయ సీజన్‌కు ముందే రైతులకు వ్యవసాయ పెట్టుబడిని అందించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 నుంచి లక్ష వరకు ప్రయోజనం చేకూరుతుంది.
వైఎస్సార్ బాటలోనే పేదల కన్నీళ్లు తుడవడానికి..
నాడు వైఎస్సార్.. చంద్రబాబు అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణలోని చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మళ్లీ అదే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు గతంలో కంటే ఎన్నో రెట్ల ఇక్కట్లకు గురయ్యారు. బాధలు ఒక పక్క, వేధింపులొక పక్క వారిని వెంటాడాయి. తన తండ్రి వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ జగన్ కూడా ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు, వారికి తానున్నానని భరోసా ఇవ్వడానికి అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేపట్టారు. 3,648 కిలోమీటర్ల మేర ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా అడుగడుగునా ప్రజల కన్నీళ్లను తుడుస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ప్రజల నుంచి జగన్‌కు విశేష ఆదరణ లభించింది. ఆయనకు ఎక్కడికక్కడ బ్రహ్మరథం పట్టారు. ఎండనక, వాననక కాలినడక ద్వారా వేల కొద్దీ మైళ్లు ప్రయాణించి ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా ఒకరేమిటి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు తీరుస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ప్రజలు పడుతున్న బాధలు ఏమిటో ముందుగానే స్పష్టమైన అవగాహన ఉన్న జగన్ గుంటూరు పార్టీ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment