అభిమాన జడి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోరువానలోనూ జనం పోటెత్తారు. తమ అభిమాన నేత కూతురు వైఎస్ షర్మిలను చూసేందుకు భారీగా తరలొచ్చారు. ఆమె ప్రసంగం వినేందుకు బారులుతీరారు. వర్షంలోనే తాను ప్రయాణిస్తున్న వాహనంపైకి ఎక్కి జనం తమపై చూపుతున్న అభిమానానికి షర్మిల ముగ్ధులయ్యారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరుసగా గురువారం నాలుగోరోజు జిల్లాలో కొనసాగింది. వైఎస్ మరణవార్త విని గుండెచెదిరి మరణించిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు పరామర్శ యాత్రలో భాగంగా 18 కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. ఉదయం కొత్తకోట మండలం కొన్నూరు నుంచి ప్రారంభమైన యాత్ర రాత్రి 10 గంటలకు కొడంగల్‌కు చేరుకుంది. కొన్నూరులో వికలాంగురాలు నాగమ్మ తల్లి వెంకటమ్మను పరామర్శించి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కొత్తకోట మీదుగా జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణానికి చేరుకుని ఎంఎ.రవూఫ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జడ్చర్ల చౌరస్తా, మహబూబ్‌నగర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించి కోస్గి మండలం అమ్లికుంటకు షర్మిల చేరుకున్నారు. గతుకుల రోడ్డు మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసి అమ్లికుంట్లకు చేరుకున్న ఆమె జంగం గురు బసవయ్య కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. పరామర్శయాత్రతో వైఎస్ కుటుంబం తమకు భరోసా ఇవ్వడంపై గురుబసవయ్య కుమారుడు కృతజ్ఞతలు తెలిపారు.
సాయంత్రం కోస్గి మండల కేంద్రానికి చేరుకున్న షర్మిల జోరువానలోనూ యాత్ర సాగించారు. మండల కేంద్రంలోని కనికె బాలరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గంటసేపు గడిపారు. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని రాజన్న కుటుంబం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు.
జోరువానలోనూ ఘనస్వాగతం
కోస్గిలోని శివాజీ చౌరస్తాకు చేరుకున్న సమయంలో జోరుగా వర్షం వస్తున్నా ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాణసంచా పేల్చుతూ షర్మిల వాహనాన్ని అనుసరిస్తూ వచ్చి ప్రసంగించాల్సిందిగా ఆమెను కోరారు. వర్షంలోనే తడుస్తూ దివంగత సీఎం వైఎస్ పేదవారి అభ్యున్నతికి చేసిన కృషిని ప్రస్తావించారు. ఇంతలో వర్షంలోనే ప్రసంగిస్తున్న షర్మిలకు భద్రతాసిబ్బంది గొడుగుపట్టారు. అక్కడే జనమంతా వర్షంలో తడుస్తుంటే తనకెందుకు?’ అంటూ గొడుగును తీసివేయించారు. అనంతరం జోరువానలోనే తమ ప్రసంగాన్ని కొనసాగించారు.
పేదప్రజల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని, ప్రజలు తమ కుటుంబంపై చూపుతున్న అభిమానానికి శిరసు వంచి, చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం దౌల్తాబాద్ ఇముడాపూర్‌లో మీదింటి ఫకీరప్ప కుటుంబాన్ని పరామర్శించి రాత్రి బస కోసం కొడంగల్‌కు చేరుకున్నారు. పరామర్శ యాత్ర కొనసాగుతున్న మార్గంలో వరుసగా నాలుగోరోజు కూడా జనం పెద్దఎత్తున షర్మిలకు స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపారు. షర్మిల రాకను స్వాగతిస్తూ పార్టీ నేతలతో పాటు వైఎస్ అభిమానులు కూడా పెద్దఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ఐదోరోజు పరామర్శయాత్ర కొడంగల్ నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా పరిగి, కొందుర్గు, షాద్‌నగర్, బాలానగర్, కొత్తూరు మండలాల మీదుగా సాగి, కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ముగియనుంది.