Y.s sharmila
-
నేడు పరామర్శించనున్న కుటుంబాలు
కొందుర్గు: షర్మిల శుక్రవారం మండలంలోని పెద్దఎల్కిచర్ల గ్రామానికి చేరుకుని వైఎస్ఆర్ మృతిని తట్టుకోలేక మృతిచెందిన సుంకరి కిష్టమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తన తల్లి కిష్టమ్మకు రాజశేఖరరెడ్డి అంటే అపారమైన గౌరవమని, తనకు ప్రతినెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడని తెలిపేదని కిష్టమ్మ కొడుకు బాలయ్య తెలిపారు. వైఎస్ మృతివార్త విని గుండెపోటుతో చనిపోయిందని వాపోయాడు. ఆ మహానేత కూతురు తమ ఇంటికి రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొత్తూరు: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక మండలంలో ఇద్దరు మృతిచెందారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం మధ్యాహ్నం మండలానికి రానున్నారు. మొదట నర్సప్పగూడలో మృతి చెందిన పెంటమీది అండాలు కుటుంబసభ్యులను పరామర్శించి అక్కడి నుండి చేగూరు మీదుగా స్టేషన్ తిమ్మాపూర్- మల్లాపూ ర్ గ్రామానికి వెళ్లి పిన్నింటి నాగిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారని పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తెలిపా రు. పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. బాలానగర్: దివంగత సీఎం వైఎస్ఆర్ మృతిని తట్టుకోలేక మృతిచెందిన బాలానగర్ మండలం గుండ్లపొట్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల శంకరయ్య కుటుంబాన్ని శుక్రవారం షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్ఆర్ మృతిని జీర్ణించుకోలేక గుండెఆగిన ప్రతిఒక్కరి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానని అప్పట్లో వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగ న్మోహన్రెడ్డి ఇడుపులపాయలో ఇచ్చిన మాటకోసం ఆమె నేడు గుండ్లపొట్లపల్లికి రానున్నారు. -
అభిమాన జడి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోరువానలోనూ జనం పోటెత్తారు. తమ అభిమాన నేత కూతురు వైఎస్ షర్మిలను చూసేందుకు భారీగా తరలొచ్చారు. ఆమె ప్రసంగం వినేందుకు బారులుతీరారు. వర్షంలోనే తాను ప్రయాణిస్తున్న వాహనంపైకి ఎక్కి జనం తమపై చూపుతున్న అభిమానానికి షర్మిల ముగ్ధులయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరుసగా గురువారం నాలుగోరోజు జిల్లాలో కొనసాగింది. వైఎస్ మరణవార్త విని గుండెచెదిరి మరణించిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు పరామర్శ యాత్రలో భాగంగా 18 కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. ఉదయం కొత్తకోట మండలం కొన్నూరు నుంచి ప్రారంభమైన యాత్ర రాత్రి 10 గంటలకు కొడంగల్‌కు చేరుకుంది. కొన్నూరులో వికలాంగురాలు నాగమ్మ తల్లి వెంకటమ్మను పరామర్శించి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తకోట మీదుగా జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణానికి చేరుకుని ఎంఎ.రవూఫ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జడ్చర్ల చౌరస్తా, మహబూబ్‌నగర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించి కోస్గి మండలం అమ్లికుంటకు షర్మిల చేరుకున్నారు. గతుకుల రోడ్డు మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసి అమ్లికుంట్లకు చేరుకున్న ఆమె జంగం గురు బసవయ్య కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. పరామర్శయాత్రతో వైఎస్ కుటుంబం తమకు భరోసా ఇవ్వడంపై గురుబసవయ్య కుమారుడు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం కోస్గి మండల కేంద్రానికి చేరుకున్న షర్మిల జోరువానలోనూ యాత్ర సాగించారు. మండల కేంద్రంలోని కనికె బాలరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గంటసేపు గడిపారు. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని రాజన్న కుటుంబం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. జోరువానలోనూ ఘనస్వాగతం కోస్గిలోని శివాజీ చౌరస్తాకు చేరుకున్న సమయంలో జోరుగా వర్షం వస్తున్నా ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాణసంచా పేల్చుతూ షర్మిల వాహనాన్ని అనుసరిస్తూ వచ్చి ప్రసంగించాల్సిందిగా ఆమెను కోరారు. వర్షంలోనే తడుస్తూ దివంగత సీఎం వైఎస్ పేదవారి అభ్యున్నతికి చేసిన కృషిని ప్రస్తావించారు. ఇంతలో వర్షంలోనే ప్రసంగిస్తున్న షర్మిలకు భద్రతాసిబ్బంది గొడుగుపట్టారు. అక్కడే జనమంతా వర్షంలో తడుస్తుంటే తనకెందుకు?’ అంటూ గొడుగును తీసివేయించారు. అనంతరం జోరువానలోనే తమ ప్రసంగాన్ని కొనసాగించారు. పేదప్రజల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని, ప్రజలు తమ కుటుంబంపై చూపుతున్న అభిమానానికి శిరసు వంచి, చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం దౌల్తాబాద్ ఇముడాపూర్లో మీదింటి ఫకీరప్ప కుటుంబాన్ని పరామర్శించి రాత్రి బస కోసం కొడంగల్‌కు చేరుకున్నారు. పరామర్శ యాత్ర కొనసాగుతున్న మార్గంలో వరుసగా నాలుగోరోజు కూడా జనం పెద్దఎత్తున షర్మిలకు స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపారు. షర్మిల రాకను స్వాగతిస్తూ పార్టీ నేతలతో పాటు వైఎస్ అభిమానులు కూడా పెద్దఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ఐదోరోజు పరామర్శయాత్ర కొడంగల్ నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా పరిగి, కొందుర్గు, షాద్‌నగర్, బాలానగర్, కొత్తూరు మండలాల మీదుగా సాగి, కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ముగియనుంది. -
నేడు వైఎస్ షర్మిల పరామర్శించనున్న కుటుంబాలు
కోస్గి : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల గురువారం కోస్గి మండలానికి రానున్నారు. మండలంలోని అమ్లికుంట్లకు వాసి జంగం గురుబసవయ్య వైఎస్ వీరాభిమాని. మహానేత మరణవార్తను టీవీలో చూస్తూ ప్రాణాలు విడిచాడు. అలాగే మండల కేంద్రంలోని బాహార్‌పేట కాలనీకి చెందిన కనికె బాల్‌రాజ్ కూడా వైఎస్ అంత్యక్రియ దృశ్యాలను టీవీలో చూస్తూ గుండెపోటుతో మరణించాడు. వారి కుటుంబాలను షర్మిల నేడు పరామర్శించనున్నారు. దౌల్తాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణవార్తను విని తట్టుకోలేక మృతిచెందిన పకీరప్ప కుటుంబాన్ని నేడు వైఎస్ షర్మిళ పరమర్శించనున్నారు. వైఎస్ మృతిని తట్టుకోలేక మండలంలోని ఇండాపూర్ గ్రామానికి చెందిన మీదింటి పకీరప్ప మరణించారు. ఆయన భార్యాపిల్లలు ఉన్నారు. అది మా అదృష్టం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి వారి గుండెల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్ఆర్ కుటుంబానికి నిరుపేదలపై ఎంతో ప్రేమ ఉంది. అది ఈ రోజు రుజువైంది. మా నాన్న చనిపోయి ఇన్నిరోజులైనా షర్మిలమ్మ మమ్మల్ని పరామర్శించడానికి రావడం మా అదృష్టం. - అమరేశ్వర్(గురుబసవయ్య కొడుకు) నమ్మలేకపోతున్నాం.. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ఇంటిపెద్ద మృతి చెందడం మా కుటుంబాన్ని కలచివేసింది. మమ్మల్ని పరామర్శించేందుకు షర్మిలమ్మ వస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం. నిరుపేదలమైన మమ్మ ల్ని నేటికీ గుర్తించుకోవడం మా అదృష్టం. - అంబిక, భరత్ (బాల్‌రాజ్ భార్య, కొడుకు) -
నేడు ఇడుపులపాయకు షర్మిల రాక
పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. బెంగళూరు నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. మహానేత, తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు వెళ్తారు. -
జిల్లాలో షర్మిల ప్రచారభేరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం జన భేరి మోగించనున్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ దాకా ఆమె జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే నెల రోజులకు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరిగేందుకు షెడ్యూల్ విడుదలైంది. వరుస ఎన్నికలతో వైఎస్సార్ సీపీ శ్రేణులు బిజీ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరడంతో పాటు, జరగబోయే ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎంపీగా గెలిపించాలని కోరుతూ షర్మిల ప్రచార శంఖం పూరించనున్నారు. 17వ తేదీ సాయంత్రం ఆత్మకూరులో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నియోజక వర్గ సమన్వయ కర్త మేకపాటి గౌతమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో జిల్లాలో షర్మిల ఎన్నికల జనభేరిని మోగిస్తారు. 18వ తేదీ ఉదయం వెంకటగిరిలో బహిరంగ సభ, నాయుడుపేటలో రోడ్‌షో, సూళ్లూరుపేటలో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి గూడూరులో బస చేసి 19వ తేదీ ఉదయం రోడ్ షో చేస్తారు. అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి నెల్లూరులో బస చేసి 20వ తేదీ ఉదయం కావలిలో రోడ్ షో జరిపి మున్సిపల్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తారు. -
నేడు నగరానికి షర్మిల
సాక్షి, సిటీబ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కును నిరసిస్తూ.. తొమ్మిది నెలల పాటు పద్నాలుగు జిల్లాల మీదుగా 3112 కి.మీ. మేర సాగిన పాదయాత్రను ఆదివారం సాయంత్రం ఇచ్ఛాపురంలో ముగించిన జగనన్న సోదరి వైఎస్ షర్మిల.. సోమవారం ఉదయం నగరానికి చేరుకోనున్నారు. ఆమె ఉదయం పది గంటలకు విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుని తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను ఆమె నేరుగా జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు. భారీ స్వాగత సన్నాహం ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కి.మీ.ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ నగర పార్టీ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, యువజన విభాగం అధ్యక్షులు పుత్తా ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు. తరలిరండి: జనార్దన్‌రెడ్డి సోమవారం నగరానికి చేరుకోనున్న షర్మిలకు దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అత్తాపూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విమానాశ్రయం నుంచి చంచల్‌గూడ జైలు వరకు షర్మిలకు అడుగడుగునా స్వాగ తం పలికే కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.