నేడు వైఎస్ షర్మిల పరామర్శించనున్న కుటుంబాలు
కోస్గి : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల గురువారం కోస్గి మండలానికి రానున్నారు. మండలంలోని అమ్లికుంట్లకు వాసి జంగం గురుబసవయ్య వైఎస్ వీరాభిమాని. మహానేత మరణవార్తను టీవీలో చూస్తూ ప్రాణాలు విడిచాడు. అలాగే మండల కేంద్రంలోని బాహార్‌పేట కాలనీకి చెందిన కనికె బాల్‌రాజ్ కూడా వైఎస్ అంత్యక్రియ దృశ్యాలను టీవీలో చూస్తూ గుండెపోటుతో మరణించాడు. వారి కుటుంబాలను షర్మిల నేడు పరామర్శించనున్నారు.
దౌల్తాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణవార్తను విని తట్టుకోలేక మృతిచెందిన పకీరప్ప కుటుంబాన్ని నేడు వైఎస్ షర్మిళ పరమర్శించనున్నారు. వైఎస్ మృతిని తట్టుకోలేక మండలంలోని ఇండాపూర్ గ్రామానికి చెందిన మీదింటి పకీరప్ప మరణించారు. ఆయన భార్యాపిల్లలు ఉన్నారు.
అది మా అదృష్టం
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి వారి గుండెల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్‌ఆర్ కుటుంబానికి నిరుపేదలపై ఎంతో ప్రేమ ఉంది. అది ఈ రోజు రుజువైంది. మా నాన్న చనిపోయి ఇన్నిరోజులైనా షర్మిలమ్మ మమ్మల్ని పరామర్శించడానికి రావడం మా అదృష్టం.
- అమరేశ్వర్(గురుబసవయ్య కొడుకు)
నమ్మలేకపోతున్నాం..
వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ఇంటిపెద్ద మృతి చెందడం మా కుటుంబాన్ని కలచివేసింది. మమ్మల్ని పరామర్శించేందుకు షర్మిలమ్మ వస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం. నిరుపేదలమైన మమ్మ ల్ని నేటికీ గుర్తించుకోవడం మా అదృష్టం.
- అంబిక, భరత్ (బాల్‌రాజ్ భార్య, కొడుకు)