కారుణ్య నియామకాల్లో కాఠిన్యం | Compassionate appointments austerity | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాల్లో కాఠిన్యం

Published Sun, Jul 20 2014 12:57 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

Compassionate appointments austerity

  •      రూ.లక్ష పరిహారానికే పరిమితం
  •      ఆర్టీసీ ‘బ్రెడ్‌విన్నర్ స్కీం’పై కార్మికుల్లో అవగాహన శూన్యం  
  • సాక్షి,సిటీబ్యూరో : బ్రెడ్‌విన్నర్ స్కీమ్... ఆర్టీసీ ప్రవేశపెట్టిన మానవీయ సంక్షేమ పథకం. ఇంట్లో సంపాదించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన కారుణ్య నియామక పథకం. కండక్టర్, డ్రైవర్, మెకానిక్, శ్రామికులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు చనిపోతే ఆ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు.  

    దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆర్టీసీలో తిరిగి ప్రారంభమైన ఈ పథకానికి అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. పథకం కింద విధించిన అర్హతలు బాధితులకు ప్రతిబంధకాలవుతున్నాయి. దాంతో రూ.లక్ష ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు ఈ పథకంపై అవగాహన కూడా సరిగా లేదు.
     
    ఇదేం బ్రెడ్ విన్నర్...

    దూద్‌బౌలికి చెందిన ఓ మహిళ కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్నారు. కూకట్‌పల్లి డిపోలో శ్రామిక్ అయిన ఆమె భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో  చనిపోవడంతో ఆ కుటుంబం ఉపాధిని కోల్పోయింది. కుటుంబ భారమంతా ఆమెపై పడింది. దీంతో ఈ పథకం కింద ఉద్యోగం కోసం ఏడాది క్రితం ఆమె ఆర్టీసీ అధికారులను ఆశ్రయించారు.

    పదో తరగతి వరకు చదువుకున్న తనకు ఏదో ఒక ఉపాధి చూపాలని వేడుకున్నారు. అధికారులు అర్హతల చిట్టా విప్పారు. పదో తరగతి ఒక్కటే చాలదని తేల్చారు. కండక్టర్ ఉద్యోగానికైనా సరే 153 సెంటీమీటర్లు ఉండాలన్నారు. కానీ ఆమె 150 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నారు. శ్రామిక్ ఉద్యోగానికి కావాల్సిన ఐటీఐ అర్హత ఆమెకు లేదు. డ్రైవింగ్ రాదు. కాబట్టి రూ. లక్ష ఆర్థిక సహాయం తీసుకొని వెళ్లిపోమన్నారు.

    ఇలాంటి సంఘటనలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2013 నుంచి ఇప్పటి వరకు 275 మందికిపైగా దరఖాస్తు చేసుకుంటే వీరిలో సగానికి పైగా ఆర్టీసీ విధించిన అర్హతలను అందుకోలేకపోయారు. మరికొందరు పథకంపై అవగాహన లేక అవకాశాన్ని కోల్పోయారు. చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి లేదా కార్మికుడి కుటుంబసభ్యుల్లో (భార్య/పిల్లలు) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే నాటికి పదోతరగతి పూర్తి చేయలేకపోతే 5 ఏళ్లలోపు ఆ అర్హతను సాధించవచ్చు. కానీ దీనిపై అవగాహన లేక చాలామంది నష్టపోతున్నారు.  
     
    బాబు హయాం నుంచే బాధలు ప్రారంభం
     
    కారుణ్య నియామక పథకం ఆర్టీసీలో 1998 వరకు నిరాటంకంగా అమలైంది. కానీ సంస్థకు నష్టాలొస్తున్నాయనే నెపంతో అప్పటి ముఖ్యమంత్రి చ ంద్రబాబునాయుడు  పథకాన్ని ఎత్తివేయించారు. దీంతో 15 ఏళ్ల పాటు ఇది ఆగిపోయింది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించారు. ఆయన మరణంతో మరోసారి బ్రేక్ పడింది. 2011లో మళ్లీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2013 జూలై వరకు ఉమ్మడి రాష్ర్టం పరిధిలో వచ్చిన 1126 మంది బాధితులకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లో 116 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ చాలామంది అర్హత లేక ఉద్యోగాన్ని పొందలేకపోయారు. దాంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement