
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలిగా రెడ్డి శాంతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా రెడ్డి శాంతి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఈ నియామకాన్ని ప్రకటించింది. అదే విధంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులను నియమించగా జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కింది. పాలకొండకు చెందిన రెడ్డి శాంతిది రాజకీయ కుటుంబం. ఆమె తాత, నానమ్మలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు.
ఆమె తండ్రి పాలవలస రాజశేఖరం కూడా ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో శాంతి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. తన నియామకంపై ఆమె స్పందిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తానని చెప్పారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కాగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ధర్మాన ప్రసాదరావు వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.