శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బు ద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఉమ్మడి పోరాటం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి రకరకాల పోరాటాలు చేస్తే కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. డ్వాక్రా రుణ మాఫీ చేయడంలోనూ, రైతులకు రుణ విముక్తులను చేయడంలోను పూర్తిగా విఫలమైన ఈయనకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు కావాలని ప్ర జలకు పిలుపునిచ్చారు.
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టి, కొత్తగా 40లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు కల్పించి ఏమీ చేయలేని మోసగాడిగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రకరకాల పథకాలు కావాలని దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క పథకం కూడా మంజూరు చేయలేని, చేతకాని పరిపాలన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు.
ఇసుక అక్రమ వ్యాపారం, నీరు–చెట్టు పనుల పేరుతో రూ.కోట్లు దోపిడీలతో అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో ఆక్కడి రైతులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని రోజుకో పార్టీతో పొత్తులకు వెంపర్లాడుతున్నారని ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment