వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించండి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహోరాత్రాలు కృషి చేసిన మహనీయుడు వైఎస్ అని కొనియాడారు. రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకువచ్చారని, ఆయన అనుసరించిన విధానాలు పొరుగు రాష్ట్రాలకే కాక, ఇతర దేశాలకూ ఆదర్శనీయమయ్యాయన్నారు. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే ఉద్దేశంతో వైఎస్ అమలు చేసిన పథకాలను ఆయన అనంతరం ఏ ప్రభుత్వాలూ కొనసాగించకపోవటం సిగ్గుచేటని నాని విమర్శించారు.
పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు కార్పొరేట్ ఉన్నత విద్య అవకాశాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆయన పాలనా దక్షతకు మచ్చుతునకలుగా చెప్పుకోవచ్చన్నారు. ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోవడానికి అధికారంలోకి రాక ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారని గుర్తు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు ఉచిత విద్యుత్ అందించి మేలు చేశారన్నారు. సమాజంలో వివిధ వర్గాలకు ఉన్నతస్థితి కల్పించడానికి రిజర్వేషన్ల శాతం పెంచడంలో ఆయన పాటించిన నిబద్ధత అపూర్వమన్నారు.
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల పక్షాన పోరాడడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, వైఎస్ కుమారుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ ఆశయాలను ప్రజలెవరూ మరిచిపోనప్పటికీ ఆయనను మరోసారి గుర్తు చేసుకోవడం రాష్ట్ర ప్రజల బాధ్యత అని నాని పేర్కొన్నారు. ఈ నెల 2న మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధం కావాలని నాని సూచించారు.