వైఎస్సార్‌ స్మృతివనం..ఇక రాజసం | Ysr Smrithivanam In Kurnool Develop In Ysrcp Govt | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ స్మృతివనం..ఇక రాజసం

Published Tue, Jun 25 2019 7:24 AM | Last Updated on Thu, Jun 27 2019 1:25 PM

Ysr Smrithivanam In Kurnool Develop In Ysrcp Govt - Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దివ్య స్మృతిలో ఒక అద్భుతమైన ఉద్యాన వనమే.. వైఎస్‌ఆర్‌ స్మృతివనం. నిర్మాణ సమయంలో అప్పటి పాలకులు ఎన్నెన్నో చెప్పారు. వైఎస్‌ఆర్‌ కీర్తి ఇనుమడించేలా.. వైవిధ్యమైన వృక్ష సంపదను భావి తరాలకు అందించేలా.. పర్యాటక కేంద్రంగా మార్చుతామంటూ హామీలు ఇచ్చి విస్మరించారు. 2009 సెప్టెంబర్‌ 2న నల్లమలలోని పావురాల్ల గుట్టపై హెలికాప్టర్‌ ప్రమాదంలో మహానేత మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన స్మృతివనం 2012లో కేవలం 22 ఎకరాల్లో పార్కు, వాచ్‌ టవర్, గార్డెన్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత నిధులు మంజూరు గాక.. అభివృద్ధికి నోచుకోక నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే వైఎస్‌ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక స్మృతి వనానికి మహర్దశ పట్టనుంది. 

సాక్షి, కర్నూలు : ఆత్మకూరు మండలం నల్లకాల్వ శివార్లలోని వైఎస్‌ఆర్‌ స్మృతివనం ఏర్పాటుకు ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని నల్లకాల్వ, రుద్రకోడు సెక్షన్లు, వెలుగోడు నార్త్‌బీట్‌ పరిధిలో సుమారు 13000 ఎకరాల అటవీ భూమిని అప్పటి రోశయ్య ప్రభుత్వం కేటాయించింది. ఈ అటవీ భూమిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ఆటంకం కలగకుండా అభివృద్ధి పనులు చేపడతామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దశాబ్దం గడించిన కేటాయించిన ప్రాంతానికి సరిహద్దులు నిర్ణయిస్తు రాళ్లు వేయడం మినహా ఇంత వరుకు ఇందులో ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ ప్రాంతంలో అందమైన కాలిబాటలు, కాల్వలపై సినిమా సెట్టింగ్స్‌ పోలిన వంతెనలు, గడ్డి మైదానాలు, వైవిధ్యమైన వృక్ష సంపదను ఏర్పాటు చేయాల్సి ఉంది. చిరుత పులులు, నెమళ్ల  పునరుత్పత్తి కేంద్రాల ప్రతిపాదన కూడా ప్రాజెక్ట్‌ రూప కల్పనలో ఉంచారు. అయితే ఇవేవి ఇంతవరకు అమలు కాలేదు. ఇటీవల రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్‌ఆర్‌ స్మృతివనం (అడవిలో) అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.   

సందర్శకులే మహారాజ పోషకులు
స్మృతివనం నిర్వహణ, సిబ్బంది వేతనాల కోసం అటవీశాఖ ఉద్యానాన్ని సందర్శించేందుకు వచ్చేవారు చెల్లించే ప్రవేశ రుసుం పైనే ఆధార పడుతోంది. తొలుత పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5 మాత్రమే వసూలు చేశేవారు. అప్పట్లో సంవత్సరానికి సందర్శకులతో రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఇది సిబ్బంది వేతనాలకే   సరిపోయేది కాదు. దీంతో ఇటీవల ప్రవేశ రుసుం రెట్టింపు చేయడంతో స్మృతివనం నిర్వహణ కోసం కూడా కొంత సొమ్ము వినియోగించుకునే వీలు కలిగింది. వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో మొత్తం 34 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 16 మంది తోటమాలులుగా, 10 మంది సెక్యూరిటీ గార్డులుగా, మరో 8 మంది సహాయకులుగా పని చేస్తున్నారు. వీరందరికి ఇంచుమించుగా రూ.6,700 మాత్రమే వేతనంగా లభిస్తోంది. సెక్యూరిటీ సిబ్బందికి ఒక వెయ్యి హెచ్చుగా వస్తోంది. వేతనాలు తక్కువగా ఉన్నా  సిబ్బంది మాత్రం ఉద్యానాన్ని కాపాడు కొస్తున్నారు.  గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన ఏపీ గ్రీన్‌ అవార్డుల్లో  వైఎస్‌ఆర్‌ స్మృతివనం ప్రథమ స్థానం దక్కించుకుంది.   

టీడీపీ హయాంలో శీత కన్ను
గత టీడీపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ స్మృతివనం అభివృద్ధి శీత కన్ను వేసింది. కనీస నిర్వహణ నిధులు కూడా విడుదల చేయలేదు. చివరకు వైఎస్‌ఆర్‌ స్మృతివనం ప్రతిష్ట మరుగుపరిచేందుకు కుట్ర పూరితంగా సిద్ధాపురం చెరువు ప్రాంతంలో సమయం సందర్భం లేకుండా ఎన్‌టీఆర్‌ పేరిట పోటీ స్మృతివనం ఏర్పాటుకు కూడా సిద్ధ పడ్డారు. ప్రతిపాదించిన స్థలం పేద గిరిజనులది కావడంతో వారు అడ్డుకోవడం, ఆ తర్వాత ఆ ప్రభుత్వ పాలన ముగిసిపోయింది.  

పునాది నుంచి పని చేస్తున్నాం
వైఎస్‌ఆర్‌ స్మృతివనం ప్రాజెక్ట్‌కు పునాదులు వేసినప్పుడు నుంచి పని చేస్తున్నాం. ఇక్కడ మొక్కలను చంటి పాపల్లా పెంచాం. ఇది మా బతుకుదెరువు, చాకిరి అనుకోలేదు. మహానేతకు సేవ చేసే భాగ్యం దక్కిందనుకుంటున్నాం. జగన్‌ సీఎం కావడంతో మాకు మంచి రోజులు వచ్చాయి. ఇక మా వేతనాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం.  
 –  నాగరాజు, తోటమాలి, వైఎస్‌ఆర్‌ స్మృతివనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement