Smrithi Vanam
-
Atmakur: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం కొత్త అందాలను సంతరించుకుంది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుత పచ్చందాల పార్క్‌గా గుర్తింపు పొందింది. దశాబ్దం కిందట ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ థీమ్ ప్రాజెక్ట్ నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేక పోయింది. 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో స్మృతి వనానికి మహర్దశ వచ్చింది. ఆరునెలల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్లు విడుదల చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆయా పనులన్నీ ప్రస్తుతం పూర్తి కావడంతో స్మృతివనం కొత్త సొబగులద్దుకుంది. ఆరుబయలు ఆడిటోరియం... పచ్చదనాల ల్యాండ్‌స్కేప్ చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా స్మృతివనంలో పచ్చటి కార్పెట్ గ్రాస్‌తో పరుచుకున్న తిన్నెలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూర్చుని కార్యక్రమం తిలకించే విధంగా మినీ వేదిక ఏర్పాటు చేశారు. దీని వెనుక ఒక తెర కూడా ఉండడంతో ఏవైనా రికార్డు చేసిన వీడియోలు, సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్ స్కేప్ మధ్యలో రెండు గ్రానైట్ శిలా మండపాలు కూడా నిర్మించారు. అక్కడక్కడా గ్రానైట్‌తో ఏర్పాటైన అరుగులు పర్యాటకులు సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. కనువిందుగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్మృతివనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రానికి శ్రీకారం చుట్టారు. అయితే, నిధుల కొరతతో దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఈ పనులు ఇటీవలే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. జీవకళలొలుకుతున్న పులిప్రతిమలు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన చిరుత పులుల ప్రతిమలు నిజం చిరుతలను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సహజ వాతావరణంలో రాజసంగా నిలుచున్న పెద్దపులి ప్రతిమ వీక్షకులను సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేస్తోంది. అంతే కాకుండా విజ్ఞాన కేంద్రపు గోడలకు వేలాడదీసిన కొన్ని వన్యప్రాణుల చిత్రపటాలు చూడ ముచ్చటగొల్పుతున్నాయి. ఈ చిత్రపటాలన్నీ కూడా చేయితిరిగిన చిత్రకారులతో గీయించ బడిన కళాఖండాలు కావడం విశేషం. పిల్లను మోస్తున్న ఎలుగుబంటి, బరక భూములపై పరుగెత్తుతున్న బట్టమేక పక్షి, గడ్డిమైదానంలో కూర్చున్న కణితి, గాల్లో ఎగిరిపోతున్న కృష్ణ జింకల సమూహం, హనీబాడ్జర్ల చిత్రపటాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. రాతిపై జీవజాలం... వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్న పాదచర మార్గాలలో రాతి స్తంభాలపై పలు వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాల శిల్పాలను చెక్కించి ఉంచారు. వీటికి సహజ వర్ణాలతో తీర్చిదిద్దడంతో ప్రత్యక్షంగా వాటిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అదే విధంగా అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తీసిన వన్యప్రాణుల చిత్రాలను ఫ్లెక్సీలుగా తీర్చి దిద్ది పలుచోట్ల ఉంచారు. ఇవి కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?) -
వైఎస్సార్ స్మృతివనం..ఇక రాజసం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దివ్య స్మృతిలో ఒక అద్భుతమైన ఉద్యాన వనమే.. వైఎస్ఆర్ స్మృతివనం. నిర్మాణ సమయంలో అప్పటి పాలకులు ఎన్నెన్నో చెప్పారు. వైఎస్ఆర్ కీర్తి ఇనుమడించేలా.. వైవిధ్యమైన వృక్ష సంపదను భావి తరాలకు అందించేలా.. పర్యాటక కేంద్రంగా మార్చుతామంటూ హామీలు ఇచ్చి విస్మరించారు. 2009 సెప్టెంబర్ 2న నల్లమలలోని పావురాల్ల గుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో మహానేత మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన స్మృతివనం 2012లో కేవలం 22 ఎకరాల్లో పార్కు, వాచ్ టవర్, గార్డెన్తో ప్రారంభించారు. ఆ తర్వాత నిధులు మంజూరు గాక.. అభివృద్ధికి నోచుకోక నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక స్మృతి వనానికి మహర్దశ పట్టనుంది. సాక్షి, కర్నూలు : ఆత్మకూరు మండలం నల్లకాల్వ శివార్లలోని వైఎస్ఆర్ స్మృతివనం ఏర్పాటుకు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లకాల్వ, రుద్రకోడు సెక్షన్లు, వెలుగోడు నార్త్‌బీట్ పరిధిలో సుమారు 13000 ఎకరాల అటవీ భూమిని అప్పటి రోశయ్య ప్రభుత్వం కేటాయించింది. ఈ అటవీ భూమిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ఆటంకం కలగకుండా అభివృద్ధి పనులు చేపడతామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దశాబ్దం గడించిన కేటాయించిన ప్రాంతానికి సరిహద్దులు నిర్ణయిస్తు రాళ్లు వేయడం మినహా ఇంత వరుకు ఇందులో ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ ప్రాంతంలో అందమైన కాలిబాటలు, కాల్వలపై సినిమా సెట్టింగ్స్ పోలిన వంతెనలు, గడ్డి మైదానాలు, వైవిధ్యమైన వృక్ష సంపదను ఏర్పాటు చేయాల్సి ఉంది. చిరుత పులులు, నెమళ్ల పునరుత్పత్తి కేంద్రాల ప్రతిపాదన కూడా ప్రాజెక్ట్ రూప కల్పనలో ఉంచారు. అయితే ఇవేవి ఇంతవరకు అమలు కాలేదు. ఇటీవల రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ స్మృతివనం (అడవిలో) అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సందర్శకులే మహారాజ పోషకులు స్మృతివనం నిర్వహణ, సిబ్బంది వేతనాల కోసం అటవీశాఖ ఉద్యానాన్ని సందర్శించేందుకు వచ్చేవారు చెల్లించే ప్రవేశ రుసుం పైనే ఆధార పడుతోంది. తొలుత పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5 మాత్రమే వసూలు చేశేవారు. అప్పట్లో సంవత్సరానికి సందర్శకులతో రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఇది సిబ్బంది వేతనాలకే సరిపోయేది కాదు. దీంతో ఇటీవల ప్రవేశ రుసుం రెట్టింపు చేయడంతో స్మృతివనం నిర్వహణ కోసం కూడా కొంత సొమ్ము వినియోగించుకునే వీలు కలిగింది. వైఎస్ఆర్ స్మృతివనంలో మొత్తం 34 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 16 మంది తోటమాలులుగా, 10 మంది సెక్యూరిటీ గార్డులుగా, మరో 8 మంది సహాయకులుగా పని చేస్తున్నారు. వీరందరికి ఇంచుమించుగా రూ.6,700 మాత్రమే వేతనంగా లభిస్తోంది. సెక్యూరిటీ సిబ్బందికి ఒక వెయ్యి హెచ్చుగా వస్తోంది. వేతనాలు తక్కువగా ఉన్నా సిబ్బంది మాత్రం ఉద్యానాన్ని కాపాడు కొస్తున్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఏపీ గ్రీన్ అవార్డుల్లో వైఎస్ఆర్ స్మృతివనం ప్రథమ స్థానం దక్కించుకుంది. టీడీపీ హయాంలో శీత కన్ను గత టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ స్మృతివనం అభివృద్ధి శీత కన్ను వేసింది. కనీస నిర్వహణ నిధులు కూడా విడుదల చేయలేదు. చివరకు వైఎస్ఆర్ స్మృతివనం ప్రతిష్ట మరుగుపరిచేందుకు కుట్ర పూరితంగా సిద్ధాపురం చెరువు ప్రాంతంలో సమయం సందర్భం లేకుండా ఎన్టీఆర్ పేరిట పోటీ స్మృతివనం ఏర్పాటుకు కూడా సిద్ధ పడ్డారు. ప్రతిపాదించిన స్థలం పేద గిరిజనులది కావడంతో వారు అడ్డుకోవడం, ఆ తర్వాత ఆ ప్రభుత్వ పాలన ముగిసిపోయింది. పునాది నుంచి పని చేస్తున్నాం వైఎస్ఆర్ స్మృతివనం ప్రాజెక్ట్‌కు పునాదులు వేసినప్పుడు నుంచి పని చేస్తున్నాం. ఇక్కడ మొక్కలను చంటి పాపల్లా పెంచాం. ఇది మా బతుకుదెరువు, చాకిరి అనుకోలేదు. మహానేతకు సేవ చేసే భాగ్యం దక్కిందనుకుంటున్నాం. జగన్ సీఎం కావడంతో మాకు మంచి రోజులు వచ్చాయి. ఇక మా వేతనాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. – నాగరాజు, తోటమాలి, వైఎస్ఆర్ స్మృతివనం -
అమరవీరుల స్థూపానికి జూన్ 2న శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గుర్తుగా భారీ స్మారక స్థూపం నిర్మించి రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున ఘనంగా నివాళులు అర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సచివాలయానికి సమీపంలో గల 12 ఎకరాల భూమిలో స్మృతివనంతో పాటు స్థూపానికి జూన్ 2న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్మృతి వనంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి సాహిత్య కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.