డాక్డరు బాచిన చెంచుగరటయ్య, ఉండవల్లి కృష్ణారావు, ఎన్. సీతారామాంజనేయులు
సాక్షి, అద్దంకి (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల్లో 2019 బరిలో అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, బీజేపీల అభ్యర్థులు పోటీపడుతున్నారు. అభ్యర్థులు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. 2019 రంగస్థలం రంజుగామారింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రచారం పర్వం పతాకస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు, వాటి అధినేతలు పోటీపడి ఒకరికి మించిమరొకరు హామీలిచ్చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం తామేమీ తీసిపోమన్నట్లు గెలిచిన తరువాత దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రజా రంజక పాలన అందిస్తామని చెప్తున్నారు. ఎవరికివారే తన గెలుపు ఖాయం అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హామీల ప్రాధాన్యతపై కొందరు అభ్యర్థులు తమ మనోగతాలు సాక్షితో పంచుకున్నారు.
దీర్ఘకాలిక సమస్యలపై ప్రధాన దృష్టి
నేను గతంలో నాలుగు సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా పనిచేశా. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగు, సాగు నీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. టీడీపీ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నేను మరలా ఎమ్మెల్యే అయితే దీర్ఘ కాలంగా అపరిషృతంగా ఉన్న పేద ప్రజలకు కావాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తా. తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని అగ్రహారం భూముల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పిస్తా. పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం పాలపొడి ప్యాక్టరీని పునరుద్ధరించి పశుపోషకులను ఆదుకుంటా. డ్వాక్రా మహిళలను అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని తయారు చేసి, ప్రతి మహిళకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించి, రెండు గేదెలను ఇచ్చి, నియోజకవర్గంలో లక్ష లీటర్ల పాల సేకరణ చేయడం ధ్యేయంగా పెట్టుకున్నా.
కృష్ణా జలాలు సక్రమంగా రానందున అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కృషితో, గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించే విధంగా చూసి సాగరు కాలువ ద్వారా నియోజకవర్గంలో సాగు నీటి సమస్య లేకుండా చేస్తా. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులైన యర్రం చిన్పపోలిరెడ్డి, భవనాశి రిజర్వాయరు పూర్తి చేస్తా. సంతమాగులూరులో 1100 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు, జే పంగులూరు మండలంలోని కొండమూరు, కోటపాడు అలవలపాడు, కొండమంజులూరు చెరువులను మినీ రిజర్వాయరుగా చేసి, వాటిని గోదావరి జలాలతో నింపి తాగు, సాగు నీటిని పూర్తి చేస్తా. గుండ్లకమ్మ నదిపైన ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్‌ను ఏర్పాటు చేసి, ఎత్తిపోతల పథకాలకు నీరందించే విధంగా కృషిచేస్తా. పేదరికమే అర్హతగా పెట్టుకుని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తా.
– డాక్డరు బాచిన చెంచుగరటయ్య, వైఎస్సార్ సీపీ అభ్యర్థి
మోదీ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి
నియోజకవర్గంలో గుండ్లకమ్మ నది దగ్గరలో ఉన్నా.. తాగు, సాగు నీటి సమస్య ఉంది. దాన్ని పరిష్కరిస్తా. సాగరునీరు రావడం లేదు. రైతులకు నదిపై ఎత్తిపోల పథకం పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తా. గ్రామాలను కలిపే విధంగా రహదారుల అభివృద్ధి చేస్తా. ప్రల కోసం పార్టీ సిద్దాతాల ప్రకారం ఉచిత ఇల్లు, విద్యుత్ గ్యాస్ ఇస్తాం. మోదీ సహకారంతో ఇవన్నీ చేస్తాం.
– ఉండవల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థి
తాగు, సాగు నీటి సమస్య పరిష్కరిస్తా
తాగు, సాగు నీటి సమస్య బాగా ఉంది. దానిని పరిష్కరిస్తా. రైతులను సంతోష పెట్టడమే ముఖ్య ఉద్దేశ్యం. రహదారులు, మౌలిక వసతుల కల్పన. భవనాశిని మినీ రిజర్వాయరుగా చేసి, పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తా. రైల్యే లైన్, బైపాస్ రహదారి ఏర్పాటుకు కృషిచేస్తా. అర్డీఓ కార్యాలయం, చారిత్రక మ్యూజియం ఏర్పాటు చేస్తా.
– ఎన్. సీతారామాంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment