మనోళ్లే
సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి నలుగురు జిల్లా వాసులే. రాష్ట్రంలో అధికారిక హోదాలలో ప్రముఖులుగా ఏకకాలంలో అరుధైన అవకాశం జిల్లాకు దక్కింది. శాసనమండలి, శాసనసభలలో ప్రతిపక్ష నాయకులుగా ఒకే జిల్లా వాసులు ఉండటం బహు అరుదు.
అధికార, విపక్ష పార్టీలలో ప్రముఖులుగా జిల్లా వాసులు ఉండటం యోగ్యకరమే. అయితే భవనానికి మూల స్థంభాలు ఎలాగో జిల్లాభివృద్ధికి ఆనలుగురు కర్త, కర్మ, క్రియలుగా మెలిగితే మరింత ప్రయోజనమని జిల్లావాసులు భావిస్తున్నారు. అప్పుడే వారి పదవులకు వన్నె తెచ్చిన నాయకులుగా నిలిచిపోనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులుగా జిల్లాకు చెందిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యలకు జిల్లా సమస్యల పట్ల సమగ్ర అవగాహన ఉంది. ఇప్పటికే పలుమార్లు వారి వైఖరిని పలు సందర్భాలలో స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులుగా జిల్లా పట్ల సమర్థవంతమైన పాత్ర పోషించే విషయంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావన. అధికార పక్షంలో కూడా జిల్లాకు ప్రాధాన్యత దక్కడం హర్షించదగ్గ పరిణామం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయగలిగితే శుభపరిణామమేనని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
క్రియాశీలక భూమిక పోషించేనా...
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎస్వీసతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌గా మేడా మల్లికార్జునరెడ్డి ప్రభుత్వంలో క్రియాశీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆఇరువురికి అవకాశం దక్కడం వారి అనుచరుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ‘కాయలు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలు’ అన్న విషయాన్ని గుర్తుంచుకుని మసులుకుంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇరువురు ప్రతిపక్ష నాయకులు జిల్లా కోసం పోరాడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్న తరుణంలో అధికార పక్షం చేయూతనందిస్తే ఉపయోగమని పలువురు భావిస్తున్నారు. అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేసుకుంటారా? ప్రోటోకాల్‌కు మాత్రమే పరిమితం అవుతారా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే.