పోలాకి: గత ప్రభుత్వంలో తంపర భూముల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం పేరుతో రూ. 12 కోట్లు ఖర్చు చేశారని, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఈ లెక్క చెప్పగలరా? అని పోలాకి పీఏసీఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కరిమి రాజేశ్వరరావు ప్రశ్నించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలసి తంపర భూములను పరిశీలించారు. అనంతరం సుసరాంలోని మాజీ ఎంపీపీ దుంపల భాస్కరరావు స్వగృహంలో ఆయన మాట్లాడారు. తంపర భూముల ముంపు పాపం ముమ్మాటికీ టీడీపీదేనని దుయ్యబట్టారు. ఉప్పుగెడ్డ విస్తరణ పేరుతో రూ.12 కోట్లు దుర్వినియోగం చేశారని, ప్రస్తుతం తంపరభూముల ముంపు రైతులను టీడీపీ నాయకులు పరామర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప్పుగెడ్డపై వంతెనలు నిర్మిస్తామని వంచన చేసిన మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. ఎంపీకి నిజంగా తంపర రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీ నిధులతో వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు కణితి కృష్ణారావు, మాజీ ఎంపీపీ దుంపల భాస్కరరావు, నాయకులు ముద్డాడ భైరాగినాయుడు, రెంటికోట త్రినాథరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment