మాచర్ల: రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు వాటిని నెరవేర్చకపోగా, కొత్త హామీలు ఇస్తూ ఆయా సామాజిక వర్గాలను మోసగించే పనిలో బిజీబిజీగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన గురువారం గుంటూరు జిల్లా మాచర్లలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని వర్గాలను మోస గించిన సీఎం ఎక్కడా కనబడలేదన్నారు. అధికారంలోకి వచ్చే ముందువరకు ఎస్సీలు, మాదిగలు, రజకులు, రెల్లి, నాయుడు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులతో పాటు ఏ వర్గాన్నీ వదలకుండా చంద్రబాబు హామీల మీద హామీలిచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రతి సామాజికవర్గాన్ని అణచివేతలో ముందంజలో ఉన్నారని దుయ్యబట్టారు. ఎవరైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే పోలీసులను అడ్డం పెట్టుకొని అణచివేస్తున్నారని విమర్శించారు.
ఇచ్చిన హామీల ప్రకారం రైతులు, మహిళలు, నిరుద్యోగులు, డ్వాక్రా సంఘ సభ్యులు, చేనేత, వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేయకుండా కావాలని జాప్యం చేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించగానే భయపడి ఊరూరా మళ్లీ కొత్త హామీలతో మభ్యపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయానికీ కేంద్రాన్ని అడిగాను... రాష్ట్రంలో నిధులు లేవు... ఇదిగో నేను అభివృద్ధి చేస్తున్నా.. ప్రతిపక్షం అడ్డగిస్తోందంటూ కాలం గడుపుతున్న సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా కరువుతో రైతులు సాగుకు నీళ్లు రాక అల్లాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇచ్చిన హామీలకు దిక్కులేదు.. కొత్త పథకాలా?
Published Fri, Sep 29 2017 2:56 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement
Advertisement