గోపవరం: టి.సండ్రపల్లె గ్రామానికి చెందిన రాధాక్రిష్ణారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి మండల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కొంత కాలంగా బెంగళూరులో కాంట్రాక్ట్ పనులు చేస్తూ వస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తెలిసిన వారి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చారు. గురువారం ఉదయం వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి రాత్రి నారాయణరెడ్డితో కలిసి బెంగళూరుకు కారులో బయలుదేరారు. నారాయణరెడ్డి కూడా కాంట్రాక్టరే. మైదుకూరు మండలం జాండ్లవరం వద్ద జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో రాధాక్రిష్ణారెడ్డితోపాటు నారాయణరెడ్డి మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాత్రికి రాత్రే మైదుకూరుకు చేరుకున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామమైన సండ్రపల్లెకు తీసుకువచ్చారు. అప్పటికే మండల వ్యాప్తంగా బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామానికి చేరుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాధాక్రిష్ణారెడ్డికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బీటెక్, చిన్న కుమారుడు 10వ తరగతి చదువుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
సాయంత్రం నిర్వహించిన రాధాక్రిష్ణారెడ్డి అంత్యక్రియలకు ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు. ముందుగా రాధాక్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ రాధాక్రిష్ణారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అలుముకున్న విషాదఛాయలు
Published Sat, May 30 2015 6:37 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM
Advertisement
Advertisement