ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): ప్రత్యేక హోదాను తాకట్టుపెడితే సహించేదిలేదని ఒంగో లు ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదనపు రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హో దా, విభజన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. బూత్ కమిటీల శిక్షణ తరగతులపై వైవీ, పార్టీ రీజి నల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావులు ధవళేశ్వరం కాటన్ అతిథి గృహంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. అమలా పురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, కొయ్యే మోషేన్‌రాజులతో కలసి కో ఆర్డినేటర్లతో చర్చించారు.
ఈ నెల 22 నుంచి 27 వరకూ బూత్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ తరగతులుంటాయన్నారు. వీటికి ప్రత్యేకంగా రీసోర్స్ టీములు వస్తాయని వివరించారు. పార్టీ ఆవిర్భావం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా విధానం, ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై వారు శిక్షణ ఇస్తారని వివరించారు. అనంతరం మాట్లాడుతూ, నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. అరుణ్‌జైట్లీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సంబరాలు చేసుకుందన్నారు.
ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో పోరాడుతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రజల నాడిని గమనించిన చంద్రబాబు, ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త డ్రామాకు తెర లేపారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఒకలా, బయట ఒకలా డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రధాని మాట్లాడుతున్నప్పుడు వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా.. టీడీపీ ఎంపీలు కూర్చున్నారన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో ఎందుకు రాజీ పడ్డారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.5 వేల కోట్లు దేనికి ఖర్చు చేశారో ప్రకటించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
వివిధ కారణాలతో జాతీయ స్థాయిలో మోదీ గ్రాఫ్ పడిపోతోందని గమనించిన టీడీపీ.. విభజన అంశాలపై పోరాడుతున్నట్లు డ్రామా ఆడుతోందన్నారు. ప్రత్యేక హోదా వదిలేశామని చెప్పడానికి ఎవరు అధికారమిచ్చారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే సహించేది లేదన్నారు. చంద్రబాబుకు దేనిలోనూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 600 హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వం మరో దుర్మార్గపు చర్యకు పాల్పడిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానూభూతిపరుల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో 40 వేలు, తూర్పు గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో 22 వేల ఓట్లు తొలగించారని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, త్వరలో భారత ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై ఒక కమిటీ వేసి సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేవిధంగా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు), సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్, తానేటి వనిత, తలారి వెంకట్రావు, రాష్ట్ర గిరిజన విభాగం అధ్యక్షుడు తెల్లం బాలరాజు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, నాయకులు విప్పర్తి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment