ఇక పోరాటమే మన పంథా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల ఫలితాల సమీక్ష.. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను విడివిడిగా నిర్వహించారు. బుధవారం నిర్వహిం చాల్సిన అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పాలకొండ నియోజకవర్గ సమీక్షను గురువారానికి వాయిదా వేశారు. ఆ నియోజవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ సీజీసీ సభ్యుడు పాలవలస రాజశేఖరం జగన్‌తో సమావేశమై పార్టీ పరిస్థితిని వివరించారు. కాగా విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ స్థానాల సమీక్ష కూడా గురువారం నిర్వహిస్తారు.
శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని పార్టీ అభ్యర్థులు, ముఖ్యనేతలతో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. మొదట శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంతో సమీక్ష ప్రారంభించారు. అనంతరం ఆమదాల వలస, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, పలాస,ఇచ్ఛాపురం నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ సమీక్షలు కొనసాగాయి. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడానికి కారణాలపై నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీపట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్లుగా మలచుకోవడంలో కొంత వెనుకబడ్డామని నేతలు చెప్పారు. అదే విధంగా సంస్థాగత నిర్మాణం, ఇతరత్రా అంశాలపై కూ డా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ కారణాలను విశ్లేషిస్తూనే పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సి చర్యలను సూచించాలని చెప్పారు.
ప్రజల పక్షాన నిలబడదాం
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలబడటంలో పార్టీ అందరికంటే ముందుంటుందన్నారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైన విధంగా ప్రజాపోరాటాలు చేస్తుం దన్నారు. అంశాల ప్రాతిపదికన పార్టీ ఎప్పటికప్పుడు స్పష్టమైన విధానా నిర్ణయాలతో ప్రజ లకు అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి పోరాటపథంలో సాగుతామని చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన అన్ని హక్కులను కాపాడతామన్నారు. అదే విధంగా పార్టీని పంచాయతీస్థాయి నుంచి అభివృద్ధి పరిచేందుకు సంస్థాగత విషయాలపై దృష్టి సారిస్తామని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
అందుకోసం తాను త్వరలో జిల్లా పర్యటనలకు కూడా వస్తానన్నారు. పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ పటిష్టతకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఏ ఒక్కరు అధైర్య పడవద్దన్నారు. కేవలం 1.93 శాతం ఓట్ల తేడాతోనే పార్టీ వెనుకబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాబట్టి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉం దని.. దాన్ని అందుకునే దిశగా పార్టీని పటిష్ట పరుస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎళ్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కిందిస్థాయి కార్యకర్త కూడా తనతో నేరుగా మాట్లాడవచ్చని.. పార్టీ పటిష్టతకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని చెప్పారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా రూపొం దించడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, వి.కళావతిలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, నర్తు రామారావులు పాల్గొన్నారు. వీరితోపాటు పార్టీ నేతలు పిరియా సాయిరాజ్, వరుదు కల్యాణి, హనుమంతు కిరణ్, దుప్పల రవీంద్ర, వై.వి.సూర్యనారాయణ, ధర్మాన పద్మప్రియ, అంధవరపు సూరిబాబు, కిల్లి వెంకట సత్యనారాయణ, పాలవలస విక్రాంత్, సువ్వారి అనిల్ కుమార్, బొడ్డేపల్లి రమేష్, కూర్మాన బాలకృష్ణ, పేరాడ తిలక్, సలాన మోహనరావు, చింతాడ గణపతి, సత్తారు సత్యం, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, ఆరంగి మురళీ, టి.కామేశ్వరిలతోపాటు పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.