సాక్షి, శ్రీకాకుళం: ఎక్కడో రాష్ట్రానికి కొసన శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇచ్ఛాపురం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తుది మజిలీ అయినా, తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభ ప్రాంతమైనా, తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు అయినా ఇక్కడే జరిగాయి. ‘‘ఎందుకో తెలీదుగాని.. వైఎస్ కుటుంబం ఇచ్ఛాపురంతో బంధం పెనవేసుకుంది.. ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను ఇక్కడి నుంచి మొదలుపెట్టడమో.. ఇక్కడే ముగించడమో వారికి ఆనవాయితీగా మారింది’’ అంటున్నారు ఇక్కడి స్థానికులు. షర్మిల పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ, స్తూపావిష్కరణ కార్యక్రమాల సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అగ్రనేతలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదివారం ఇచ్ఛాపురం జనసంద్రంగా మారింది.
అంతటా ఉత్సవ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా దీనిపైనే జనం చర్చించుకోవడం కనిపించింది. పదేళ్ల క్రితం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్రను ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచే ఆ కుటుంబానికి ఇచ్ఛాపురంపై మమకారం పెరిగిందని వారంటున్నారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండో విడత ఓదార్పు యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని.. ఇప్పుడు షర్మిల మరో ప్రజాప్రస్థానం ఇక్కడే ముగించడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మూడు ఘటనలు తమ పట్టణానికి ఆ కుటుంబంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచాయని వారంటున్నారు.
గతంలో వైఎస్‌ను, ఆ తర్వాత జగన్‌ను, ఇప్పుడు షర్మిలమ్మను చూడగలిగానని బోయిన భారతి అనే చిరు వ్యాపారి ఆనందంగా చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్ అమలు చేశారు. ఇప్పుడు షర్మిలమ్మ ఇచ్చిన హామీలు కూడా అమలవుతాయన్న నమ్మకం ఉందని ఇడ్లీలు అమ్ముకునే పూర్ణాసాహు చెప్పారు. జగనన్న సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. మహానేత వైఎస్‌లోని తెగువ, సాహసం షర్మిలలోనూ కనిపించాయని టీకొట్టు నడుపుకొనే దామిచెట్టి పార్వతి అభిప్రాయపడ్డారు.
వైఎస్ పాదయాత్రకు కొనసాగింపే..
‘‘ప్రజా సమస్యలు పట్టించుకోని ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్‌తో కుమ్మక్కై చేస్తున్న నీచమైన రాజకీయాలను ఎండగడుతూ, దేవుని దీవెనలతో, నాన్న ఆశీస్సులతో ఇడుపులపాయ నుంచి జగనన్న వదిలిన ఈ బాణం 3,112 కిలో మీటర్లు ప్రయాణించి ఈ రోజు గమ్యం చేరుకుంది. వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానమే జగనన్న తరఫున చేస్తున్న ఈ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్ఫూర్తి. సరిగ్గా 10 ఏళ్ల కిందట వైఎస్సార్ తన పాదయాత్రను ఒక మహాయజ్ఞంలా, మండుటెండలో రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్లకుపైగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అందుకే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన మరు నిమిషం నుంచి ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచన చేశారు. కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచన చేసి అద్భుత పథకాలు ప్రవేశపెట్టారు. మహానేత వైఎస్సార్ ఆ వేళ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే మా పాదయాత్ర. ఈ 230 రోజులు, ఈ 3,112 కిలోమీటర్లు, ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో ఆయా గ్రామాల్లో మాతో పాటు కదంతొక్కి, మాకు అండగా నిలబడిన ప్రతి అక్కకూ, చెల్లికి, అవ్వకూ, తాతకు, ప్రతి సోదరునికి, సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’’
- షర్మిల
వైఎస్ జ్ఞాపకాలు.. ఉద్విగ్న క్షణాలు..
అక్టోబర్ 18న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైఎస్సార్ ‘విజయవాటిక’ వద్ద ముగిసింది. ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గం బలరాంపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 4.6 కిలోమీటర్లు నడిచి లొద్దపుట్టి వద్ద భోజన విరామం తీసుకున్నారు. అక్కడ్నుంచి సరిగ్గా 3.15 గంటలకు షర్మిల తుది మజిలీ కోసం బయలు దేరారు. ఆకాశం అంతా మేఘావృతమయింది. ఒక్కో చినుకు రాలుతోంది. 1.7 కిలోమీటర్లు నడిచి వైఎస్సార్ విజయవాటిక వద్దకు చేరుకున్నారు. అది వైఎస్సార్ నడిచిన ప్రాంతం. ‘ప్రజాప్రస్థానం’ పేరుతో వైఎస్సార్ 68 రోజుల్లో 1,473 కిలోమీటర్లు నడిచి జయకేతనం ఎగురవేసిన స్థలం. వైఎస్సార్‌కు జయజయధ్వానాలు పలికిన ప్రదేశం. వైఎస్ జ్ఞాపకాలన్నింటినీ పదిలంగా దాచుకున్న ఆ ప్రదేశానికి రాగానే షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని గుండెల్లో దాచుకొని, చెరగని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ విజయ వాటిక వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. అక్కడితో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. అక్కడ్నుంచి ‘విజయవాటిక’కు ఎదురుగా ఏర్పాటు చేసిన మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం ‘విజయ ప్రస్థానం’ స్తూపం వద్దకు వెళ్లారు. స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదిక మీదకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు.
నాడు తండ్రి.. నేడు తనయ
Published Mon, Aug 5 2013 4:30 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement