జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు | zptc, mptc elections 2014 | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు

Published Mon, Mar 17 2014 3:55 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

zptc, mptc elections 2014

నేటి నుంచి నామినేషన్లు
 జెడ్పీటీసీ నామినేషన్లకు జిల్లా కేంద్రంలో ఆరు కౌంటర్లు
 ఎంపీటీసీ నామినేషన్లు ఆయా మండల కార్యాలయాల్లోనే...
  కొత్తగా 18,374 మందికి ఓటుహక్కు

 
 ఒంగోలు, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభంకానుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలుచేసేందుకు అంచెలంచెలుగా అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు.
 
  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణను నిశితంగా పరిశీలించేందుకు జిల్లాకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి నియమించారు. తాజాగా 18,374 మందికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 జిల్లాలోని 56 మండలాల్లో మొత్తం 790 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను పాటిస్తున్నారా..లేదా... అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
 
  నామినేషన్ల సమయంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రిజర్వుడు అభ్యర్థులు నామినేషన్ దాఖలుచేసేందుకు అవసరమైన కులధ్రువీకరణ పత్రాన్ని మీసేవా కేంద్రాల ద్వారా కాకుండా నేరుగా తహసీల్దార్ ద్వారా పొందే వీలు కల్పించారు.
 
  అదే విధంగా జెడ్పీటీసీ నామినేషన్లకు ఒంగోలులోని దక్షిణ బైపాస్‌లో ఉన్న జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరాన్ని ఎంపిక చేశారు. తొలుత జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఎంపికచేసినప్పటికీ ట్రాఫిక్ సమస్య ఎక్కువుగా ఉంటుందని భావించి వేదికను మార్చారు. మొత్తం ఆరు కౌంటర్ల ద్వారా నామినేషన్లు స్వీకరిస్తారు. ఐదు కౌంటర్లలో పది మండలాల చొప్పున, ఒక కౌంటర్‌లో ఆరు మండలాల నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించారు.
 
 కౌంటర్ల వివరాలు...
 కౌంటర్-1కి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఏపీఎస్‌ఐడీసీ జియాలజిస్టు వ్యవహరిస్తారు. లింగసముద్రం, మర్రిపూడి, ముండ్లమూరు, పామూరు, పీసీ పల్లి, పొదిలి, పొన్నలూరు, సింగరాయకొండ, తాళ్లూరు, తర్లుపాడు మండలాల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
 
 
  కౌంటర్-2కి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పట్టుపరిశ్రమలశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వ్యవహరిస్తారు. ఉలవపాడు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, జరుగుమల్లి, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు మండలాలు.
  కౌంటర్-3కి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి వ్యవహరిస్తారు. మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం మండలాలు.
 
 
  కౌంటర్-4కి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పరిశ్రమలశాఖ డిప్యూటీ డెరైక్టర్ వ్యవహరిస్తారు. కొత్తపట్నం, మద్దిపాడు, మార్టూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పర్చూరు, సంతమాగులూరు, సంతనూతలపాడు, టంగుటూరు, వేటపాలెం మండలాలు.
 
  కౌంటర్-5కి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పశుసంవర్థకశాఖ డిప్యూటీ డెరైక్టర్ వ్యవహరిస్తారు. సీఎస్ పురం, దర్శి, దోర్నాల, గుడ్లూరు, హనుమంతునిపాడు, కందుకూరు, కనిగిరి, కొనకనమిట్ల, కొండపి, కురిచేడు మండలాలు.
 
 కౌంటర్-6కి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వ్యవహరిస్తారు. అద్దంకి, బల్లికురవ, చినగంజాం, చీమకుర్తి, చీరాల, యద్దనపూడి, ఇంకొల్లు, జే పంగులూరు, కారంచేడు, కొరిశపాడు మండలాల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
 
 జిల్లాలో పెరిగిన ఓటర్లు...
 జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల సంఖ్య 19,56,304 మందిగా ఇటీవల అధికారులు ప్రకటించారు. వారిలో 9,78,920 మంది మహిళలు, 9,77,384 మంది పురుషులుగా పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 19,74,678కు పెరిగింది. వారిలో మహిళలు 9,90,003 మంది కాగా, పురుషులు 9,84,675 మంది. దీని ప్రకారం జిల్లాలో 11,083 మంది మహిళలు, 7,291 మంది పురుష ఓటర్లు కలిపి మొత్తం 18,374 మంది ఓటర్లు పెరిగారు.
 
  అదే విధంగా గతంలో 2,587 పోలింగ్‌బూత్‌లుండగా తాజాగా మరో 8 పోలింగ్ స్టేషన్లను పెంచారు. దీంతో పోలింగ్‌స్టేషన్ల సంఖ్య 2,595కు చేరుకుంది.
 ధరావత్తు రుసుం...
 ఎంపీటీసీ స్థానానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 1,250, ఇతరులకు 2,500 రూపాయలు. జెడ్పీటీసీ స్థానానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 2,500, ఇతరులకు 5 వేల రూపాయలు. ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల నిమిత్తం గరిష్టంగా లక్ష, జెడ్పీటీసీ అభ్యర్థి 2 లక్షల రూపాయలు ఖర్చుచేయవచ్చు. ఈ నెల 20వ తేదీలోపు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
 
 4
 కట్టుదిట్టంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాతోపాటు మైక్రోఅబ్జర్వర్లు
 అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
 రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ విజయకుమార్
 ఒంగోలు, న్యూస్‌లైన్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఆదివారం ఉదయం ఆయన సమీక్షించారు.
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లన్నీ ఒంగోలులోనే దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్‌ను జెడ్పీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా నియమించామన్నారు.
 
 ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని మండలాల్లో సీనియర్ అధికారులనే రిటర్నింగ్ అధికారులుగా నియమించామని, వారికి సహకరించేందుకు తహసీల్దారు, మరో అధికారిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలును పర్యవేక్షించేందుకు ఎంపీడీఓలను కేటాయించామన్నారు. మండల స్థాయిలో కోడ్ అమలు పర్యవేక్షణ కోసం ఒక బృందాన్ని కూడా నియమించినట్లు తెలిపారు.
 
  వారు కాకుండా జిల్లావ్యాప్తంగా 36 బృందాలను వీడియో వ్యూయింగ్ టీంలుగా ఏర్పాటు చేసినట్లు క లెక్టర్ చెప్పారు. వారు జిల్లావ్యాప్తంగా వచ్చిన వీడియో ఫుటేజీలను పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన ఖర్చును కూడా గణించేందుకు 36 యాక్షన్ అకౌంటింగ్ టీములను ఏర్పాటు చేశామన్నారు.  36 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, ప్రతి ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ముగ్గురు సభ్యులుంటారన్నారు.
 
  అవికాకుండా 56 స్టాటిక్ సర్వైవలెన్స్ టీములను కూడా ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ప్రతి మండల కేంద్రంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని, నామినేషన్ దాఖలు చేసే సమయంలో సాంకేతిక కారణాలతో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు హెల్ప్‌లైన్ ఉపయోగపడుతుందన్నారు. ఈ సెంటర్ ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చన్నారు.
 
  ఇప్పటి వరకు ఒక దశలోనే ఎన్నికలు జరుగుతాయని తమకు అధికారిక సమాచారం ఉందని, రెండు దశల్లో జరపాలని ఉత్తర్వులు వస్తే ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో రెండు దశలుగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
 
 
 బీఫామ్‌ను ఇద్దరు అభ్యర్థులకు ఇస్తే మొదట అభ్యర్థి దాఖలు చేసిన బీఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటామని, అయితే రెండో వ్యక్తికి ఇచ్చిన బీఫాంలో మొదట ఇచ్చిన బీఫాంను రద్దుచేసినట్లు పొందుపరిస్తే..రెండో అభ్యర్థి బీఫాంను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు.  
 
 
 పోలింగ్ బూత్‌ల్లో వెబ్‌కెమెరాలు:
 ఇప్పటికే పలు పోలింగ్ బూత్‌లను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడ వెబ్‌కెమెరాలు వినియోగిస్తామన్నారు. ఎవరైనా ఇంటర్‌నెట్ ద్వారా ఇంట్లో నుంచే సంబంధిత పోలింగ్‌బూత్ వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు. రాజకీయ పార్టీలు సమస్యాత్మక ప్రాంతాల జాబితా ఇస్తే ఆ పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కెమెరాలతో పాటు మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
 
 
 ఈ సందర్భంగా పలువురు రాజకీయ పక్షాల నేతలు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజైన ఈనెల 14న తహసీల్దార్లకు ఒంగోలులో సమీక్ష ఏర్పాటు చేశారని, తద్వారా కొందరు అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రం అందక నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
 
  సమావేశంలో జెడ్పీ సీఈవో ఏ.ప్రసాద్, ఏవో ఎం.వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ తరఫున నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్.క్రాంతికుమార్, ప్రచార విభాగం నగర కన్వీనర్ ధూళిపూడి ప్రసాద్‌నాయుడు, టీడీపీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసయాదవ్, కార్యవర్గ సభ్యులు దాసరి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా , బీజేపీ, బీఎస్పీ పార్టీల తరఫున సంబంధిత నాయకులు సమీక్షలో పాల్గొన్నారు.
 
 
 ఎంపీటీసీ అభ్యర్థికి లక్ష.. జెడ్పీటీసీ అభ్యర్థికి * 2 లక్షల పరిమితి:
 జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ మాట్లాడుతూ ఎంపీటీసీ అభ్యర్థి  లక్ష రూపాయలు, జెడ్పీటీసీ అభ్యర్థి  రెండు లక్షల రూపాయల్లోపు మాత్రమే ఎన్నికల ఖర్చు ఉండాలన్నారు. ఖర్చులపై ప్రతి మూడు రోజులకు ఒకసారి సర్టిఫై చేయించుకోవాలన్నారు.
 
  రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఫారం-ఎ ను ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా ఎన్నికల అధికారికిగానీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారికిగాని అందజేయాలన్నారు.  లేకపోతే సంబంధిత రాజకీయ పార్టీకి చెందిన చిహ్నాన్ని అభ్యర్థికి కేటాయించరన్నారు. ఎంపీటీసీకి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు * 1250, ఇతరులు * 2,500, జెడ్పీటీసీకి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు * 2,500, ఇతరులు * 5 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 17 నుంచి ఈనెల 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement