
మారుతీ సుజుకీ కార్లు (ఫైల్ ఫోటో)
ముంబై : దేశీయ అతిపెద్ద ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ తన ఫ్యామిలీ కారు ఇమేజ్‌కు మెగా బూస్ట్ అందించబోతోంది. సిక్స్ స్పీడు గేర్‌బాక్స్‌తో ఈ ఏడాది తన కార్లను లాంచ్ చేయబోతోంది. ఆల్టో నుంచి సియాజ్ వరకు తన మొత్తం పోర్ట్‌ఫోలియో కార్లు, ప్రస్తుతం 5 స్పీడు గేర్‌బాక్స్‌లనే కలిగి ఉన్నాయి. కోడ్‌నేమ్ ఎంఎఫ్30తో ఈ సిక్స్-స్పీడ్ ట్రాన్సమిషన్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో మొత్తంగా తన కార్ల డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచబోతోందని తెలుస్తోంది.
తొలుత ఈ ఏడాది సిక్స్-స్పీడ్ ట్రాన్సమిషన్‌తో 50వేల యూనిట్లను ప్రవేశపెడుతుందని, అనంతరం 2020 నాటికి ఏడాది 4 లక్షల యూనిట్ల చొప్పున డిమాండ్ పెంచుతుందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. తొలుత స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో ఈ సిక్స్-స్పీడ్ ట్రాన్సమిషన్ ప్రొగ్రామ్‌ను మారుతీ లాంచ్ చేయబోతుందని తెలిపాయి. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 5 స్పీడు గేర్‌బాక్స్‌తో గత నెలలోనే లాంచ్ చేసింది. సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో హైవేపై గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇంజిన్‌పై ఒత్తిడి కూడా అంతగా ఉండదు. తక్కువ కేబిన్ శబ్దంతో మెరుగైన ఫ్యూయల్ ఎకానమీని సాధించవచ్చు. అయితే భవిష్యత్తు ప్రొడక్ట్‌లు, టెక్నాలజీలపై తాము ఎలాంటి గైడెన్స్ ఇవ్వమని మారుతీ సుజుకీ స్పందించింది.
మారుతీ సుజుకీ సిక్స్ స్పీడు గేర్‌బాక్స్‌ను వాడటం ఇదేమీ తొలిసారి కాదు. అంతకముందు ఎస్-క్రాస్‌కు, 1.6 లీటరు డీజిల్ ఇంజిన్‌తో వచ్చిన ప్రీమియం క్రాస్-ఓవర్‌కు ఈ టెక్నాలజీని వాడింది. కానీ కొత్త వెర్షన్‌ల లాంచింగ్‌ల సమయంలో మాత్రం ఈ సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను కంపెనీ వాడలేదు. ఎస్-క్రాస్‌లో ప్రస్తుతం 5 స్పీడు గేర్‌బాక్స్‌నే వాడుతోంది. తన ప్రత్యర్థుల సిక్స్ స్పీడు గేర్‌బాక్స్ కార్లు వెర్నా, క్రెటా, ఎలైట్ ఐ 20, ఎలంట్రా, టక్సన్‌లకు పోటీగా మారుతీ తన గేర్‌బాక్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.