మరికొద్ది సేపట్లో రిలయన్స్ సంచలనం?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టనుందనే అంచనాలు భారీ గా నెలకొన్నాయి. గురువారం ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో అదరగొట్టిన 40వ (ఏజీఎం) వాటాదారుల సాధారణ వా ర్షిక సమావేశం జరుగుతోంది. అనంతరం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో ఎలాంటి ప్రకటనలతో ముందుకు రానున్నారనే ఆసక్తి, ఉత్కంఠ ఈ సందర్భంగా మార్కెట్ వర్గాల్లో, ఖాతాదారుల్లో నెలకొన్నాయి.
ముఖ్యంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం కంపెనీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉచిత వాయిస్, డేటా సేవలకు నాంది పలికిన జియో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది. తాజా ఏజీఎంలో జియో ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు దూరం చేసే మరో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆ కంపెనీ నుంచి రానున్న రూ.500 .1000 4జీ ఫీచర్ ఫోన్‌ను ఈ సమావేశంలో ఆవిష్కరించనున్నట్టు సమాచారం. అలాగే సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అటు రిలయన్స్ ప్రకటించిన ఫలితాల నేపథ్యంలో ఎనలిస్టులు కూడా ఆర్‌ఐఎల్ పై సానుకూలంగా ఉన్నారు. ప్రధానంగా రిఫైనింగ్ పెట్రో కెమికల్ బిజినెస్ లో ఆర్‌ఐఎల్ సాధించిన పురోగతి ఈ షేరును కొత్త రికార్డు స్థాయిలకు చేర్చనుందని భావిస్తున్నారు.
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాల్లో 28 శాతం జంప్ చేసి 9,108 కోట్లకు చేరింది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న బాలాజీ టెలిఫిలిమ్స్‌లో రూ. 403 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రూ. 403 కోట్ల పెట్టుబడితో బాలాజీ టెలిఫిలిమ్స్‌లో 24 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం రూ. 164/ షేర్ చొప్పున 2.5 కోట్ల షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేసేందుకు బాలాజీ టెలిఫిలిమ్స్ సిద్ధమైంది. అలాగే బాలాజీ టెలిఫిలిమ్స్‌లో రిలయన్స్‌కు చెందిన ఇద్దరికి బోర్డు సభ్యత్వం లభించనుంది. ఈ డీల్ తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్ ప్రమోటర్ వాటా 32 శాతానికి తగ్గనుంది. అలాగే రిలయన్స్ జియో రూ. 20 వేల కోట్ల రైట్స్ ఇష్యూకు రాబోతోన్న సంగతి తెలిసిందే.