నెట్‌ అక్కర్లేదు...  సౌండ్‌తోనే నగదు చెల్లించొచ్చు! | 5 lakh transactions per month; 16 crore equity | Sakshi
Sakshi News home page

నెట్‌ అక్కర్లేదు...  సౌండ్‌తోనే నగదు చెల్లించొచ్చు!

Published Sat, Apr 14 2018 12:14 AM | Last Updated on Sat, Apr 14 2018 12:14 AM

5 lakh transactions per month; 16 crore equity - Sakshi

కో–ఫౌండర్లుకుమార్‌ అభిషేక్‌ (ఎడమ), వివేక్‌ కుమార్‌ సింగ్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాజుల కాలంలో లావాదేవీలన్నీ వస్తు మార్పిడి విధానంలో జరిగేవి. అక్కడి నుంచి నగదుతో కొనుగోలు చేసే తరానికి చేరాం. టెక్నాలజీ వచ్చాక డిజిటల్‌ లేదా క్రెడిట్, డెబిట్‌ కార్డులతో పేమెంట్‌ చేసేస్తున్నాం. కానీ, ఇకపై ఇవేవీ అక్కర్లేదు జస్ట్‌.. ధ్వని తరంగాలతో లావాదేవీలు చేసేయొచ్చు. దేశంలో తొలిసారిగా సౌండ్‌ వేవ్స్‌తో వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది టోన్‌ట్యాగ్‌. బెంగళూరులో ఆరంభమైన టోన్‌ట్యాగ్‌ వివరాలు, సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ కో–ఫౌండర్‌ వివేక్‌ కుమార్‌ సింగ్‌ ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...

‘‘నఫ్ఫ ఇన్నోవేషన్‌ టెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన యాప్‌ పేరే టోన్‌ట్యాగ్‌. నేను, కుమార్‌ అభిషేక్‌ కలిసి రూ.25 లక్షల పెట్టుబడితో 2013లో బెంగళూరు కేంద్రంగా దీన్ని ఆరంభించాం. టోన్‌ట్యాగ్‌ ద్వారా లావాదేవీలు జరపాలంటే వర్తకుడి వద్ద టోన్‌ట్యాగ్‌ అభివృద్ధి చేసిన రిటైల్‌ పీవోడీ పరికరం ఉండాలి. ఒకవేళ అప్పటికే వర్తకుడి దగ్గర పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌), ఎలక్ట్రానిక్‌ డాటా క్యాప్చర్‌ (ఈడీసీ) మిషన్లుంటే వాటిలో మా సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌(ఎస్‌డీకే) టెక్నాలజీని ఇన్‌స్టాల్‌ చేస్తాం. ఇక లావాదేవీలు జరిపే కస్టమర్‌కు మొబైల్‌ బ్యాంకింగ్, వ్యాలెట్, పేమెంట్‌ యాప్స్‌ ఉండాలి. ఎప్పుడైతే కస్టమర్‌ తన ఫోన్‌ను టోన్‌ట్యాగ్‌ డివైజ్‌ దగ్గర పెడతాడో.. వెంటనే పరికరంలోని ఎస్‌డీకే ఆల్గరిథం డాటాను ధ్వని తరంగాల రూపంలో మార్చేస్తుంది. వెంటనే ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే ఆటోమెటిక్‌గా కస్టమర్‌ ఫోన్‌లో టోన్‌ట్యాగ్‌ యాప్‌ నుంచి పేమెంట్‌ అప్షన్స్‌ ఓపెన్‌ అవుతాయి. పిన్‌ నంబర్, చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేసి ఎంటర్‌ చేస్తే చాలు 3 సెకన్లలో లావాదేవీ పూర్తవుతుంది. అంతే!

మరి, సురక్షితమేనా?
టోన్‌ట్యాగ్‌ యాప్‌ను స్పీకర్‌ ఉన్న ఎలాంటి ఫోన్‌లోనైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా కస్టమర్లు టోన్‌ట్యాగ్‌ యాప్‌లో క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు మీద ఉండే 11 అంకెల నంబర్‌ను, పేరు, సీవీవీ నంబర్లను నమోదు చేయాలి. ఈ వివరాలన్నీ ఫోన్‌లో కాకుండా టోన్‌ట్యాగ్‌ సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా టోన్‌ట్యాగ్‌ యాప్‌ ద్వారా లావాదేవీలు జరపలేరు. ఎందుకంటే యాప్‌లోకి ఎంటర్‌ కావాలంటే పిన్‌ నంబరు కావాలి! ఎస్‌డీకే టెక్నాలజీని ఇన్‌స్టాల్‌ చేసిన ఏటీఎంలల్లో నుంచి డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు.

10 లక్షల మంది వర్తకులు..
ప్రస్తుతం దేశంలో 10 లక్షల మంది వర్తకులు టోన్‌ట్యాగ్‌ కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 2.9 లక్షల మంది దగ్గర పేమెంట్‌ అకౌంట్‌ డివైజ్‌ (పీఏడీ) ఉంది. ప్రస్తుతం నెలకు 5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. రూ.50–200 వరకు లావాదేవీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి లావాదేవీ మీద పేమెంట్‌ కంపెనీ నుంచి 1.5 శాతం ఫీజు రూపంలో తీసుకుంటాం. ఇదే మా ఆదాయ మార్గం. ఈ ఏడాది ముగింపు నాటికి నెలకు 15 లక్షల లావాదేవీలకు చేరాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు టోన్‌ట్యాగ్‌ టెక్నాలజీపై 7 పేటెంట్లకు దరఖాస్తు చేసుకున్నాం. 

18 పేమెంట్‌ సంస్థలతో ఒప్పందం..
మాస్టర్‌ కార్డ్, ఫినాకిల్, ఫస్ట్‌ డేటా, ఎయిర్‌టెల్‌ మనీ, ఫ్రీచార్జ్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి 18 సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో రెండు పేమెంట్‌ బ్యాంక్‌లతో, వ్యాలెట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నాం. చర్చలు తుది దశలో ఉన్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా, సింగపూర్, అమెరికా దేశాలకు విస్తరిస్తాం.

ఈ ఏడాది మరిన్ని నిధుల సమీకరణ..
ప్రస్తుతం సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో రూ.16 కోట్లను సమీకరించాం. ఇందులో రూ.8 కోట్లు ట్రోపికాల్‌ స్టార్, రూ.6 కోట్లు రిలయెన్స్‌ వెంచర్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ల నుంచి సమీకరించాం. మిగిలినవి నాస్కామ్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ అరుణ్‌ సేత్, టీవీ మోహన్‌దాస్‌ పాయ్, అనంద్‌ చంద్రశేఖరన్, దీపక్‌ గైసాస్‌లు పెట్టుబడిగా పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రౌండ్‌ నిధుల సమీకరణ చేస్తాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్త వాళ్లతో సంప్రతింపులు ప్రారంభించాం. ఈ ఏడాది ముగింపులోగా డీల్‌ను క్లోజ్‌ చేస్తాం’’ అని వివేక్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement